ఆమె తొలితరం కథానాయిక. ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత... జాతీయోద్యమ స్ఫూర్తిని ‘మనదేశం’ ద్వారా వెండితెరపై నిక్షిప్తం చేసిన తొలి నిర్మాత... సి.కృష్ణవేణి. ఆమె సారఽథ్యంలో రూపుదిద్గుకున్న, ఎన్టీఆర్‌ను నటుడిగా పరిచయం చేసిన ఆ చిత్రం తెలుగు సినీరంగంలో ఒక సంచలనం. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా...‘‘మన దేశం’’ చిత్రం నాటి జ్ఞాపకాలు ఆమె మాటల్లోనే.!
‘‘జాతీయోద్యమ కాంగ్రెస్ నాయకులంటే నాకు ఎంతో అభిమానం. నాకు నేనుగా ఎన్నడూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనలేదు... కానీ ఆంగ్లేయుల చెర నుంచి నా దేశం విముక్తి పొందాలని కోరుకున్నాను. అందుకోసం నా వంతు బాధ్యతను నిర్వర్తించేందుకు ప్రయత్నించాను. బాల్యం నుంచి నవలా పఠనం నా జీవితంలో భాగం. ఏదో ఒక నవల చదవకుండా రోజు ముగిసేది కాదు.! అలా నేను చదివిన అనేక నవలల్లో ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్చంద్ర ఛటోపాధ్యాయ రచించిన ‘విప్రదాసు’ నాకు విపరీతంగా నచ్చింది. ఆ కథలో భారత స్వాతంత్య్రం కోసం నిరంతరం పరితపించే ‘ద్విజదాసు’, ఆధునిక భావాలు కలిగిన ‘వందన’ పాత్రలతో పాటు తన సవతి కొడుకును కన్నబిడ్డకన్నా మిన్నగా చూసే ‘దయామయి’ మాతృప్రేమ నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఎలాగైనా ఆ నవలను సినిమాగా తీయాలనుకున్నాను. వందన పాత్ర నేనే చేయాలనుకున్నాను. అదే మాటను నా భర్త మీర్జాపురం రాజా మేకా వెంకటరామయ్య అప్పారావు బహదూర్‌తో చెబితే, ‘‘అంత రిస్కు అవసరమా! వద్దు’’ అన్నారు.
మాది అన్యోన్య దాంపత్యం అయినా, మా ఇద్దరి రాజకీయ అభిప్రాయాలు వేరే. అప్పటికే ఆయన జస్టిస్ పార్టీ జిల్లా బోర్డు అధ్యక్షుడు. హోదా ప్రకారం చూస్తే... ఆనాటి ఆ పదవి నేటి ఎమ్మెల్యే పదవి కన్నా ఎక్కువ. పైగా రాజావారు ఆంగ్లేయుల పక్షపాతి. నేను బ్రిటిష్ పాలనకు బద్ధ వ్యతిరేకిని. కాంగ్రె్‌సకు వీరాభిమానిని. కానీ ఆయన నా అభిప్రాయాలను సమ్మతించకున్నా, గౌరవించేవారు. ఆయనది అంత గొప్ప మనసు. నాది అనుకున్న పని చేసితీరాలనే మొండి పట్టుదల. కనుక రాజావారికి ఇష్టంలేకున్నా ‘విప్రదాసు’ నవలను సినిమాగా తీయాలని నిశ్చయించుకున్నాను. అనుకున్నట్టుగానే తీశాను కూడా. ఆ చిత్రమే నట దిగ్గజం ఎన్టీఆర్, సంగీత సమ్రాట్ ఘంటసాల వెంకటేశ్వరరావులను తెలుగు తెరకు పరిచయం చేసిన ‘మన దేశం’.
దేశ విభజనకు వ్యతిరేకంగా పాట పెట్టాం!
జాతీయోద్యమ నేపథ్యంతో వచ్చిన తొలి తెలుగు సినిమా ‘మన దేశం’ అని చెప్పేందుకు గర్విస్తున్నాను. నిజానికి 1946లోనే సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. కానీ కొన్ని కారణాల వల్ల మూడేళ్లు ఆలస్యం అయింది. ఆ బెంగాలీ నవల ఇతివృత్తాన్ని తెలుగు సమాజానికి అన్వయించడంతో పాటు కలకాలం నిలిచే మాటలు, పాటలను సముద్రాల రాఘవాచార్య అందించారు. ఎల్వీ ప్రసాద్ తన దర్శకత్వ ప్రతిభతో కథకు ప్రాణంపోశారు. చిత్తూరు నాగయ్య, చదలవాడ నారాయణరావు అన్నదమ్ములుగా ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక రకంగా తెలుగులో ‘తొలి మల్టీస్టారర్ చిత్రం కూడా ఇదే!’ అని ఆనాడు కొందరు సినీ విశ్లేషకులు రాశారు. సినిమాలోని ‘భారత యువకా కదలరా. నవయువ భారత విధాత కదలరా!’, ‘జయ జననీ పరమపావనీ, జయ జయ భారతి జననీ’, ‘వెడలిపో తెల్లదొర మా దేశపు ఎల్ల దాటీ వెడలిపో’ లాంటి దేశభక్తి గీతాలు ఆనాడు ఒక సంచలనం. సినిమాలో కథానాయికగా నటించడంతో పాటు ఆ పాటలనూ పాడాను. నాకు జానపద కళలంటే చాలా ఇష్టం. కనుక ‘అత్తలేని కోడలు ఉత్తమురాలు’ తదితర పాటలతో పాటు వీధి నాటకం, ఒగ్గు కథ, బుర్ర కథ, గంగిరెద్దుల ఆట తదితర జానపద కళారూపాలతో ప్రత్యేక గీతాలు రూపొందించాం. ‘తోడునీడగా ఉండరమ్మా! వేరైతే మర్యాదగా ఉండదమ్మా!’ అంటూ దేశ విభజనకు వ్యతిరేకంగా మతసామరస్యాన్ని కాంక్షిస్తూ సాగే అందులోని ఒక పాట సమకాలీన పరిస్థితులకూ అద్దంపడుతుంది. అదొక్కటే కాదు, సినిమాలోని చాలా సన్నివేశాలు అలాగే అనిపిస్తాయి.
నేటికీ ఆ సన్నివేశం ఆకట్టుకుంటోంది!
భారతదేశ స్వాతంత్య్రం కోసం కొందరు పోరాడుతుంటే, మరికొందరు బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఆ త్యాగధనులను వెంటాడి హింసించే పోలీసుల దాష్టీకాలనూ ‘‘మన దేశం’’ సినిమాలో చూడచ్చు. అందులో ఆంగ్లేయుల సేవలో తరించే పోలీసు అధికారిగా ఎన్టీఆర్ నటించారు. ‘‘దేశభక్తి రాజద్రోహంగా ఎంచే ఈ ప్రభుత్వానికి నేను దాసుడిగా ఉండను. ఇదే నా రాజీనామా’ అంటూ ఆ పోలీస్ పేరుతో లేఖ రాసి బుద్ధి చెప్పే సంఘటన తాలూకూ వీడియో క్లిప్ ఇవాళ్టికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోందని కొందరు మిత్రులు చెప్పగా విని ఆనందించాను.
కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు...
‘మన దేశం’ సినిమా అంతా మద్రాసులోని మా ‘శోభనాచల స్టూడియో్స’లోనే చిత్రీకరించాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులూ అక్కడే చేయించాం. అదే ఏడాది మాకు అమ్మాయి పుట్టింది. ఆమె పేరుతో మేకా రాజ్యలక్ష్మీ అనూరాధ (ఎంఆర్ఏ) ప్రొడక్షన్స్ సమర్పణలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రెండేళ్ల అనంతరం 1949, నవంబరు24న ఆ సినిమా విడుదలయింది. జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించిన ‘మన దేశం’ చిత్రాన్ని తెలుగు ప్రజానీకం అమితంగా ఆదరించారు. సినిమా బాగా ఆడింది. అంతకన్నా మాకు మంచి పేరూ తెచ్చిపెట్టింది. అయితే, కాంగ్రెస్ నాయకులెవరూ సినిమాను చూడటం కానీ, ప్రమోట్ చేయడం కానీ జరగలేదు. వాళ్లు ఎందుకో మా సినిమాను అంతగా పట్టించుకోలేదు. అప్పటికే నేను ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుడిని కలిసి సినిమా చూడమని అడిగాను. కానీ వారెవరూ పెద్దగా స్పందించలేదు. నేనంతగా అభిమానించిన ఆనాటి కాంగ్రెస్ పెద్దలే నా సినిమా పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం నాకు ఇప్పటికీ లోటుగా అనిపిస్తుంది. ఒకసారి మాత్రం జస్టిస్ పీవీ రాజమన్నార్, టంగుటూరి ప్రకాశం పంతులు తదితర ప్రముఖులు ‘మన దేశం’ సినిమా నిర్మాతగా నన్ను ఒక సభలో ప్రత్యేకంగా సత్కరించారు. కానీ సినిమాకు రావాల్సినంత గుర్తింపు దక్కకపోవడం బాధాకరం.
ఆ ఘనత ఆయనదే!
నా భర్త మీర్జాపురం రాజా పేరుకే ఆంగ్లేయుల పక్షం. ఆయన జస్టిస్ పార్టీ అయినప్పటికీ జాతీయవాద కాంగ్రెస్ నాయకులెవరైనా తన వద్దకు విరాళాల కోసం వస్తే, కాదనకుండా డబ్బు ఇచ్చి పంపేవారు. మద్రాసులోని ఆంధ్ర మహిళా సభ భవనాల నిర్మాణానికి ఆర్థిక సహాయాన్నీ అందించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఆ రోజుల్లోనే 1500 ఎకరాలను బ్రిటిష్ ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. అదే ప్రాంతంలో లెప్రసీ కాలనీ నిర్మాణానికి తోడ్పడ్డారు. ఇలా ఒకటా, రెండా...ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు మీర్జాపురం రాజా ఆర్థిక సహాయం అందించారు. అంతకుమించి ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, అంజలీదేవి, సూర్యకాంతం, ఘంటసాల, రమేశ్ నాయుడు తదితరులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత మీర్జాపురం రాజావారికే దక్కుతుంది.’’
మనుషులు మారాలి!
ఇప్పుడు నా వయసు 97 ఏళ్లు. నా జ్ఞాపకాలు చాలావరకూ నా మస్తిష్కం నుంచి వీడిపోయాయి. ఏదో గుర్తున్న కొన్ని ఘటనలను తలుచుకొని సంతోషించడమే.! ఇదివరకటితో పోలిస్తే, ఇప్పుడు సమాజంలో స్వార్థం మరింత పెరిగింది. అదే మనిషి స్వాతంత్ర్యాన్ని కబళిస్తోంది. ఇది మంచిది కాదు. మనుషులు మారాలి. మంచి దిశగా ఆ మార్పు సాగాలి.
- కె. వెంకటేశ్
ఫొటో: అశోకుడు