ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పిల్లలూ చదివేలా సర్కారీ బడులు!

ABN , First Publish Date - 2022-02-20T12:01:39+05:30 IST

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పిల్లలనూ చేర్పించే స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పిల్లలూ చదివేలా సర్కారీ బడులు!

  • మన బస్తీ- మన బడి లక్ష్యమదే: మంత్రి తలసాని

హైదరాబాద్‌ సిటీ : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పిల్లలనూ చేర్పించే స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి  చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా మున్ముందు సర్కారీ బడులు మారుతాయన్నారు. ప్రభుత్వం చేపట్టిన మన బస్తీ- మన బడి కార్యక్రమంపై హోంమంత్రి మహమూద్‌ అలీ, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ అధికారులతో కలిసి మంత్రి తలసాని శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహ్లాదకరమైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడమే మన బస్తీ- మనబడి ముఖ్య ఉద్దేశమన్నారు.


ఈ కార్యక్రమంలో తొలివిడతలో 239 పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాధాన్యతా క్రమం లో నియోజకవర్గానికి 10 చొప్పున అత్యవసరంగా పనులు చేపట్టాల్సిన పాఠశాలలను గుర్తించాలని సూచించారు. డిజిటల్‌ విద్య అమలు చేయడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అందుబాటులో ఉన్న జీహెచ్‌ఎంసీ స్థలాలను క్రీడా స్థలాలుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనపై సోమవారం జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. హోం మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ కార్పొరేట్‌ సంస్థలు, ప్రవాస భారతీయుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో కలెక్టర్‌ శర్మన్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రమేష్‌, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓలు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-20T12:01:39+05:30 IST