Mukesh Ambani: ముకేశ్ అంబానీని బెదిరించిన వ్యక్తికి 30 వరకు పోలీస్ కస్టడీ

ABN , First Publish Date - 2022-08-17T00:34:35+05:30 IST

బిలియనీర్ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి బెదిరింపు కాల్స్ చేసిన

Mukesh Ambani: ముకేశ్ అంబానీని బెదిరించిన వ్యక్తికి 30 వరకు పోలీస్ కస్టడీ

ముంబై: బిలియనీర్ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తికి కోర్టు ఈ నెల 30 వరకు పోలీస్ కస్టడీ విధించింది. నిందితుడు విష్ణు బౌమిక్ (56) స్వాత్రంత్య దినోత్సవం వేళ ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు మూడుసార్లు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దహీసార్ నుంచి దక్షిణముంబైలో డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. నేడు (మంగళవారం) అతడిని ముంబై (mumbai)లోని 37వ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని ఈ నెల 30 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  


నిందితుడిని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున అతడు బెదిరింపు కాల్స్ చేయడంతో దాని వెనక ఏమైనా ఉద్దేశం, లక్ష్యం ఉన్నాయా? అన్నది విచారించాల్సి ఉందని పేర్కొంది. మిగతా రోజుల్లో అతడు ఎందుకు కాల్స్ చేయలేదని ప్రశ్నించింది. ముకేశ్ అంబానీకి ముప్పు ఉందని, నిందితుడు ఆయనకే ఎందుకు కాల్స్ చేశాడని ప్రాసిక్యూషన్ వాదించింది. కాబట్టి ఇది చిన్న విషయం కాదని, చాలా తీవ్రమైన విషయమని పేర్కొంది. ఈ కేసు వెనక ఎవరెవరు ఉన్నారో తేల్చాల్సిన అవసరం కూడా ఉందని వివరించింది. పూర్తి సాంకేతికంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 


నిందితుడి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. నిందితుడు నేరుగా ఎవరికీ కాల్స్ చేయలేదని, ఆసుపత్రికి చేశాడని పేర్కొన్నారు. కానీ నేరుగా వ్యక్తులకే కాల్ చేసినట్టు చిత్రీకరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స తీసుకుంటున్నట్టు సర్టిఫెక్ కూడా చూపిస్తానని చెప్పారు. తన క్లయింట్‌కు ఎలాంటి ఉద్దేశం, లక్ష్యం లేవని స్పష్టం చేశారు. వాదనలు విన్న మేజిస్ట్రేట్ కోర్టు ఆగస్టు 30 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  


గతేడాది కూడా ముకేశ్ అంబానీ కుటుంబం ఇలాంటి బెదిరింపులే ఎదుర్కొంది.  ఆయన నివాసం ‘అంటిలియా’(Antilia) బయట 20 జిలెటిన్ స్టిక్స్‌తో పార్క్ చేసిన  ఓ స్కార్పియో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ఓ లేఖ కూడా దొరికింది. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే కేసుతో సంబంధం ఉందన్న థానేకు చెందిన వ్యాపారవేత్త మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించారు. అంతకుముందు జరిగిన విచారణలో అంబానీ నివాసం వెలుపల పార్క్ చేసిన స్కార్పియో తనదేనని హిరేన్  అంగీకరించారు. అనంతరం గతేడాది మార్చి 5న థానే సమీపంలోని ఓ ముళ్ల పొదలో ఆయన మృతదేహం లభ్యమైంది. 

Updated Date - 2022-08-17T00:34:35+05:30 IST