టిక్‌టాక్ లైవ్‌లో మాజీ భార్య.. కిరోసిన్ పోసి తగలబెట్టిన భర్తకు మరణశిక్ష

ABN , First Publish Date - 2021-10-16T02:50:17+05:30 IST

మాజీ భార్య లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా నిప్పు అంటించి చంపిన వ్యక్తికి చైనా కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడు టాంగ్

టిక్‌టాక్ లైవ్‌లో మాజీ భార్య.. కిరోసిన్ పోసి తగలబెట్టిన భర్తకు మరణశిక్ష

బీజింగ్: మాజీ భార్య లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా నిప్పు అంటించి చంపిన వ్యక్తికి చైనా కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడు టాంగ్ లు ఉద్దేశపూర్వకంగానే ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించిన సిచువాన్ ప్రావిన్స్‌ అబా ప్రాంతంలోని ఇంటర్మీడియెట్ ప్రజా కోర్టు దోషిగా తేల్చింది. అతడు చేసిన నేరం ‘చాలా క్రూరమైనది’గా పేర్కొన్న కోర్టు అతడికి మరణశిక్ష విధించింది.


టాంగ్ మాజీ భార్య అమచు (30) టిబెటిన్ వ్లాగర్. ‘లాము’ పేరుతో చైనా టిక్‌టాక్ వెర్షన్ ‘డౌయిన్’లో వీడియోలు చేస్తూ ఉంటుంది. ఆమెకు 7.70 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిత్యం అద్భుతమైన వీడియోలు పోస్టు చేస్తూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలోని జీవన విధానం, కొండలు వంటి వీడియోలతోపాటు వంటలు, కుటుంబ సభ్యులతో గడుపుతున్న వీడియోలను పోస్టు చేస్తూ ఉంటుంది. 


మేకప్ లేకుండా వీడియోలు చేస్తుండడంతోపాటు ఒక్కోసారి సంప్రదాయ టిబెటన్ దుస్తులు ధరించి వీడియోలు చేస్తుండడంపై ఆమెపై ప్రశంసలు కురిసేవి. అప్పటికే ఇద్దరు పిల్లల తల్లయిన అమచు 2009లో టాంగ్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా తరచూ గొడవలు జరిగేవి. ఆమెపై టాంగ్ పలుమార్లు చేయి కూడా చేసుకున్నాడు. ఇద్దరి మధ్య పొసగకపోవడంతో జూన్ 2020లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలని టాంగ్ కోరినప్పటికీ ఆమె నిరాకరించింది. 14 సెప్టెంబరు 2020న రాత్రి 10.30 గంటల సమయంలో టాంగ్ లాము తండ్రి ఇంటికి వెళ్లాడు. అక్కడ లాము తన ఫాలోవర్లతో లైవ్‌లో మాట్లాడుతోంది. ఆమెపై ఒక్కసారిగా కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు.  


90 శాతం గాయాలైన లాము చికిత్స పొందుతూ రెండు వారాల తర్వాత మరణించింది. లాముపై నిప్పు అంటించి పారిపోయిన టాంగ్‌‌ను ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ  ఘటనలో లాము తండ్రి ఇల్లు కూడా పూర్తిగా కాలిబూడిదైంది.


ఈ ఘటన తర్వాత దేశంలోని మహిళలపై గృహహింస పెచ్చుమీరుతోందంటూ ఆందోళనలు వెల్లువెత్తాయి. టాంగ్‌కు మరణశిక్ష విధించాలంటూ లాము లక్షలాదిమంది ఫాలోవర్లు డిమాండ్ చేశారు. లాము హ్యాష్‌ట్యాగ్‌తో చైనా సోషల్ మీడియా వీబో హోరెత్తిపోయింది. తాజాగా ఈ కేసును విచారించిన కోర్టు టాంగును దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది.


Updated Date - 2021-10-16T02:50:17+05:30 IST