జపాన్‌ ‘యానిమే’ని భారత్‌కు తెచ్చాడు

ABN , First Publish Date - 2020-07-15T05:30:00+05:30 IST

యానిమే... సంప్రదాయ జపాన్‌ యానిమేషన్‌ ఇది. చాలా క్లిష్టమైనది... ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. దాన్ని ఇప్పుడు భారత్‌కు తెచ్చాడు 28 ఏళ్ల ఢిల్లీ యువకుడు రాజర్షీ బసు...

జపాన్‌ ‘యానిమే’ని భారత్‌కు తెచ్చాడు

యానిమే... సంప్రదాయ జపాన్‌ యానిమేషన్‌ ఇది. చాలా క్లిష్టమైనది... ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. దాన్ని ఇప్పుడు భారత్‌కు తెచ్చాడు 28 ఏళ్ల ఢిల్లీ యువకుడు రాజర్షీ బసు. మొట్టమొదటిసారిగా ‘కర్మచక్ర’ పేరుతో పూర్తి స్థాయి ‘యానిమే’ చిత్రాన్ని రూపొందించాడు. ఇంతకీ ఎవరీ రాజర్షి... ‘యానిమే’లో అంతగా ఏముందంటారా..! అయితే ఇక చదవండి... 


ఢిల్లీ నగరం... బాగా రద్దీగా ఉండే ప్రాంతం. అందులోని ఓ అపార్ట్‌మెంట్‌ బేస్‌మెంట్‌కు వెళితే... కనిపించీ కనిపించకుండా ఓ స్టూడియో కనిపిస్తుంది. అదే ‘స్టూడియో దుర్గ’. భారత్‌లో తొలి ‘యానిమే’ స్టూడియో. లాక్‌డౌన్‌తో అంతా స్తంభించిన వేళ... అక్కడ 8 మంది మాత్రం బిజీగా ఉన్నారు. వారందరినీ ఓ కుర్రాడు నడిపిస్తున్నాడు. అతడే రాజర్షీ బసు. ‘స్టూడియో దుర్గ’ వ్యవస్థాపకుడు, సీఈఓ. సృజనకు అవకాశం ఉన్న ఏదైనా సరే ఉత్పత్తి చేయడా నికి.. మార్కెటింగ్‌కు ముందుంటాడు. ముఖ్యంగా ఆడియో విజ్యువల్‌ కంటెంట్‌! డిజిటల్‌ మీడియా పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ప్రావీణ్యం ఉన్నవాడు. 

మరి వీరంతా ఆ స్టూడియోలో ఏం చేస్తున్నారు? ‘కర్మచక్ర’ అనే పూర్తిస్థాయి ‘యానిమే’ చిత్రం కోసం శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి 20 నిమిషాలను మినీ సిరీస్‌గా యూట్యూబ్‌లో విడుదల చేశారు. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఒకటి రెండు నిమిషాల ట్రైలర్లు కాకుండా... అంత సినిమాను ముందే ఎందుకు వదిలారని అడిగితే... ‘‘యానిమే గురించి భారత్‌లో పెద్దగా తెలియదు. అలాంటప్పుడు క్షణాల్లో వచ్చిపోయే ట్రైలర్స్‌తో దాని ప్రత్యేకత అర్థం కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అంటాడు రాజర్షి. అతడి శ్రమ ఫలించింది. రాజర్షి బృందం కృషిని అభినందిస్తూ చాలామంది కామెంట్స్‌ పెట్టారు. ఇది వారిలో కొత్త జోష్‌ తెచ్చింది. 




ఏమిటీ ‘కర్మచక్ర’..? 

ఆధునిక భారత్‌లో ఓ మిస్టరీ డ్రామా! వీళ్లు రూపొందిస్తున్న ‘కర్మచక్ర’ హిందూ పురాణాలు, సైబర్‌ టెక్నాలజీలను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న పూర్తి నిడివి చిత్రం ఇది. ‘‘స్కూల్లో ఉన్నప్పటి నుంచే ‘మంగా’ బొమ్మలు వేసేవాడిని. మూడేళ్ల కిందట ఈ స్టూడియోను ప్రారంభించినప్పుడు చాలామంది నన్ను పిచ్చివాడి కింద జమకట్టారు. భారత్‌లో ‘యానిమే’కు ఆదరణ లేదనేది వారి భావన. కానీ వారి అంచనాలనూ ‘కర్మచక్ర’ తలకిందులు చేసింది’’ అంటాడు రాజర్ష్షి. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం అతడే! అంతేకాదు... సౌండ్‌ ట్రాక్‌ కూడా సమకూర్చాడు. రాజర్షితో కలిపి ఎనిమిది మంది సభ్యులున్న ‘స్టూడియో దుర్గ’ బృందంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. యానిమేషన్‌, ఇలస్ర్టేషన్‌, బ్యాక్‌గ్రౌండ్‌, 3డీ మోడలింగ్‌... ఇలా అనేక అంశాలు. అందరూ ప్రతిభావంతులే! 


పెద్దలకూ నచ్చేలా... 

భారత్‌లో ‘యానిమే’ పిల్లలు, పురాణ గాథలకు సంబంధిం చిన కంటెంట్‌కే పరిమిత మైంది. 1992లో వచ్చిన ‘రామాయణ’ను జపాన్‌ చిత్ర నిర్మాత యుగో సాకో, భారత యానిమేటర్‌ రామ్‌మోహన్‌లు కలిసి రూపొందించారు. ‘కార్టూన్‌ నెట్‌వర్క్‌’లో ప్రసారమైన ‘బతు గైడెన్‌’ కూడా భారత్‌-జపాన్‌ సంయుక్త ప్రాజెక్టే. ఈ క్రమంలో పిల్లలతో పాటు పెద్దలకు కూడా నచ్చే ‘యానిమే’ తీయాలనే ఉద్దేశంతోనే రాజర్ష్షి ‘స్టూడియో దుర్గ’ ప్రారంభించాడు. అదీ జపాన్‌ వారి సహకారం లేకుండా! 


మన ముద్ర... 

అయితే ‘యానిమే’ అన్నది జపాన్‌ వారి సృష్టి అయినప్పుడు ఇక అందులో మన ముద్ర ఏముంటుందని వాదించేవారూ ఉన్నారు. వారికి రాజర్షి చెప్పే సమాధానం... ‘‘పాశ్చాత్య హిప్‌హాప్‌ను చూసి ఇండియన్‌ హిప్‌హాప్‌ పుట్టింది. అలాంటప్పుడు జపాన్‌ ‘యానిమే’ను మనం స్ఫూర్తిగా ఎందుకు తీసుకోకూడదు? సంతోషించదగింది ఏమిటంటే... మా కంటెంట్‌ ‘యానిమే’ అభిమానులకు నచ్చింది’’. యానిమేషన్‌ చిత్రమంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఎవరూ ముందుకు రాకపోవడంతో ‘కర్మచక్ర’కు రాజర్షీనే నిధులు సమకూర్చుకున్నాడు. ఓటీటీల ద్వారా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.  


అభిమానులెందరో..

‘యానిమే’లను కూడా థియేటర్లలో ప్రదర్శించాలని అభిమానులు ఆ మధ్య పెద్దసంఖ్యలో కోరారు. దాని ఫలితంగానే గత ఏడాది ‘టెంకి నో కో’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఈ యానిమే జపాన్‌ (2019)లో అత్యధిక వసూళ్లు సాధించింది. భారత్‌లో కూడా అభిమానులు అలాంటి రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ‘ఇండియా వాంట్స్‌ యానిమే’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో హల్‌చల్‌ చేస్తున్నారు. 


చాలా సీనుంది... 

అమెరికాలోని ‘బర్కిలీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’లో ప్రత్యేక కోర్సు చేసిన రాజర్షికి పలు రంగాల్లో ప్రవేశం ఉంది. మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌గా, కంపోజర్‌గా, అరేంజర్‌గా, పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టాఫ్‌గా అనుభవం గడించాడు. రెండుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న రాబిన్‌ హోగర్త్‌ ఆల్బమ్‌కు స్టూడియో కో-ఆర్డినేషన్‌ చేశాడు. ఆటిజమ్‌పై తీసిన డాక్యుమెంటరీకి నేపథ్య సంగీతం అందించాడు. ఇది ‘వియ్‌ కేర్‌’ అంతర్జాతీయ చిత్రోత్సవంలో రెండో స్థానం దక్కించుకుంది. డిజైనింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌లోనూ పట్టుంది.  పలువురు సినీ సంగీత దర్శకులతో కలిసి పనిచేశాడు కూడా. 


ఏమిటీ ‘యానిమే’..?

ఆంగ్ల పదం ‘యానిమేషన్‌’ నుంచి వచ్చిందే ‘యానిమే’. జపాన్‌ వెలుపల దీన్ని ‘జపానిమే’ అని కూడా అంటారు. ఇది సంప్రదాయ పద్ధతిలో చేసే యానిమేషన్‌. కచ్చితంగా చెప్పాలంటే... ‘ట్రెడిషనల్‌ హ్యాండ్‌ డ్రాన్‌ 2డీ యానిమేషన్‌’. అనుకున్న కాన్సెప్ట్‌కు అనుగుణంగా పెన్సిల్‌తో బొమ్మలు గీస్తారు. ఏ చిన్న కదలిక కావాలన్నా దానికొక బొమ్మ గీయాలి. తరువాత వాటికి డిజిటల్‌లో రంగులు అద్దుతారు. 20 నిమిషాల యానిమేషన్‌ చిత్రం కావాలంటే కనీసం 30వేల ఫ్రేమ్‌లు గీయాలి. ఒకవేళ అది యాక్షన్‌ చిత్రమైతే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రస్తుతం అంత రిస్క్‌ ఎవరూ తీసుకోవడం లేదు. వచ్చేవన్నీ ‘సీజీఐ’ (కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజిరీ) 3డీ అప్లికేషన్‌తో చేసినవే! టీవీల్లో వస్తున్న ‘మోటూ పత్లూ’, ‘వీరూ’, ‘ది లిటిల్‌ సింగమ్‌’ తదితర కార్టూన్‌ సిరీస్‌లన్నీ ఇలా తీసినవే! 


Updated Date - 2020-07-15T05:30:00+05:30 IST