ఇంటర్నెట్ డెస్క్: ఎలాగైన అమెరికాకు వెళ్లాలనుకున్న ఓ యువకుడు ఏకంగా విమానం ల్యాండింగ్ గేర్ ఉండే కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని మియామీకి చేరుకున్నాడు. అయితే.. అధికారులు అప్పటికే అతడి గురించి తెలిసుండటంతో శనివారం విమానం ల్యాండవగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడు గ్వాటెమాలా దేశానికి చెందిన వాడని అధికారులు తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు అతడు ఇలాగే ప్రయాణించాడని సమాచారం. అతడు పోలీసుల అదుపులో తీసుకున్నప్పటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూతల స్వర్గధామంగా పేరుపడ్డ అమెరికాలో తమకు భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో సెంట్రల్ అమెరికాకు చెందిన అనేక మంది ఇలా ప్రమాదకరమైన ప్రయాణాలు చేసి అమెరికాకు చేరుకుంటుంటారు. కొందరు అమెరికాలోకి మాదకద్రవ్యాలు తరలించేందుకు కూడా ఇటువంటి రిస్క్ తీసుకుంటారు.