విమానంలో అల్పాహారం తీసుకెళ్లిన ప్రయాణికుడికి భారీ షాక్! రూల్స్ తెలియకపోతే అంతే..

ABN , First Publish Date - 2022-08-03T04:07:40+05:30 IST

ఎయిర్‌లైన్స్ సంస్థల నిబంధనలను విమాన ప్రయాణికులు కచ్చితంగా పాటించాలి. ఏమరపాటుగా ఉన్నా.. నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోకపోయినా సమస్యలు తప్పవు. ఇటీవల ఓ పర్యాటకుడికి సరిగ్గా ఇటువంటి అనుభవమే ఎదురైంది.

విమానంలో అల్పాహారం తీసుకెళ్లిన ప్రయాణికుడికి భారీ షాక్! రూల్స్ తెలియకపోతే అంతే..

ఎన్నారై డెస్క్: ఎయిర్‌లైన్స్ సంస్థల నిబంధనలను విమాన ప్రయాణికులు కచ్చితంగా పాటించాలి.  ఏమరపాటుగా ఉన్నా.. నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోకపోయినా సమస్యలు తప్పవు. ఇటీవల ఓ పర్యాటకుడికి సరిగ్గా ఇటువంటి అనుభవమే ఎదురైంది. నిబంధనలను అతిక్రమిస్తూ విమానంలో మెక్‌డోనల్డ్స్‌లో కొనుక్కున్న ఆహారాన్ని తీసుకెళ్లిన అతడు చివరకు 2,226 డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది దాదాపు రూ.2 లక్షలకు సమానం. 


ఆస్ట్రేలియాకు(Australia) వెళ్లే క్రమంలో ఓ టూరిస్టు బాలీలో(Bali) మెక్‌డోనల్డ్స్ రెస్టారెంట్‌లో(McDonalds) ఓ మీల్స్‌ ప్యాక్‌ను కొనుక్కున్నాడు. గుడ్లు, మెక్‌మఫ్ఫిన్స్‌తో కూడిన ఆ మీల్స్ ప్యాక్ అంటే అతడికెంతో ఇష్టం. తరువాత.. ఆ ఆహారాన్ని తన బ్యాగులో పెట్టుకుని విమానం ఎక్కేశాడు. ఆస్ట్రేలియాలో దిగాక అక్కడి సిబ్బంది అతడి లగేజీని తనిఖీ చేశారు. అతడి హ్యండ్‌బ్యాగును వాసన చూసిన సెక్యురిటీ శునకం.. ఆహారం ఉన్న విషయాన్ని గుర్తించింది. దీంతో అధికారులు అతడిని ఆ ఆహారం ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ క్రమంలో టూరిస్ట్ తన మెక్‌డోనల్డ్స్ మీల్స్ విషయాన్ని ఎయిర్‌పోర్టు అధికారులకు ముందుగా చెప్పలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా.. అతడు పలు తప్పుడు డాక్యుమెంట్లు కూడా సమర్పించినట్టు తేలింది. దీంతో.. అధికారులు అతడిపై ఏకంగా 2,226 డాలర్ల జరిమానా(Fine) విధించారు. 


ఈ ఘటనపై ఆస్ట్రేలియా వ్యవసాయశాఖ మంత్రి ఘాటుగా స్పందించారు. ఇది అత్యంత ఖరీదైన బ్రేక్‌ఫస్ట్ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘విమాన టిక్కెట్టు ధర కంటే జరిమానా రెండు రెట్లుగా ఉంది. కానీ అతడిపై జాలి చూపించనక్కర్లేదు. బయోసేఫ్టీ నిబంధనలు అతిక్రమించే వారి విషయంలో మేము కఠినంగా ఉంటాం’’ అని అన్నారు. దేశంలోని పొలాలు, వ్యవసాయ ఉత్పత్తులను చీడపీడల నుంచి కాపాడేందుకు బయోసేఫ్టీ నిబంధనలు పాటించడం ఎంతో అవసరమని ఆయన వివరించారు. ఆహార పదార్థాల కారణంగా దేశంలోకి చీడపీడలు ప్రవేశించి పంటలు నాశనమయ్యే అవకాశం ఉండటంతో అనేక ప్రభుత్వాలు బయోసేఫ్టీ నిబంధనల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తాయి.

Updated Date - 2022-08-03T04:07:40+05:30 IST