కిడ్నీ కావాలంటూ ట్విట్టర్‌లో వేడుకోలు.. అనూహ్యంగా తీరిన రోగి కష్టాలు..!

ABN , First Publish Date - 2022-02-04T02:29:58+05:30 IST

కిడ్నీ చెడిపోవడంతో ప్రాణ సంకటం ఎదుర్కొన్న ఓ అమెరికా వ్యక్తి చివరికి సోషల్ మీడియా చలవతో ఆ సమస్య నుంచి గట్టెక్కాడు.

కిడ్నీ కావాలంటూ ట్విట్టర్‌లో వేడుకోలు.. అనూహ్యంగా తీరిన రోగి కష్టాలు..!

ఇంటర్నెట్ డెస్క్: కిడ్నీ చెడిపోవడంతో ప్రాణ సంకటం ఎదుర్కొన్న ఓ అమెరికా వ్యక్తి చివరికి సోషల్ మీడియా చలవతో ఆ సమస్య నుంచి గట్టెక్కాడు.  సోషల్ మీడియానే తన సమస్య తీర్చిందంటూ ధన్యవాదాలు ఇటీవల తెలిపాడు. అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రానికి చెందిన క్రిస్ స్ట్రోత్ సంగీతకారుడు. అయితే.. కొన్నేళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో అతడు డయాలిసిస్‌పైనే ఆధారపడసాగాడు. ఈ క్రమంలో నిస్సహాయ స్థితిలో కూరుకుపోయిన అతడు చివరకు సోషల్ మీడియాను ఆశ్రయించాడు!  ‘‘చిక్కుల్లో పడ్డా..  నాకో కిడ్నీ కావాలి.. ’’అంటూ ఓ చిన్న ట్వీట్ చేశారు. దీంతో.. ఆయనను ఫాలో అవుతున్న వాళ్లలో 19 మంది వెంటనే రెస్పాండయ్యారు. 


అయితే..ట్వీట్ చేశాక క్రిస్ మనసు మరల్చుకునేందుకు ఓ సినిమాకు వెళ్లాడు. మూవీ పూర్తయ్యాక బయటకొచ్చిన ఆయన..సోషల్ మీడియాలో తనకు వెల్లువెత్తుతున్న మద్దుతు చూసి షాకైపోయారు. అనేక మంది తమ కిడ్నీ ఇస్తామంటూ ముందుకు వచ్చారు. చివరికి తనకు ముఖ పరిచయం ఉన్న స్కాట్ పాకుడైటిస్.. కిడ్నీయే క్రిస్‌కు అమర్చేందుకు తగినదని వైద్యులు తేల్చారు. దీంతో.. క్రిస్ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ‘‘పద్నాలుగేళ్లుగా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ.. ఎందరో స్నేహితులను పొందాను.. మరికొందరు శత్రువులయ్యారు. చివరికి సోషల్ మీడియా నాకో కిడ్నీని కూడా ఇచ్చింది. ఇదే తొలి సోషల్ మీడియా ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్’’ అంటూ క్రిస్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-02-04T02:29:58+05:30 IST