2 వేల కిలోల మొసలి! అతడి తలను నోట పట్టినా...

ABN , First Publish Date - 2020-09-27T16:39:00+05:30 IST

చావు నోట్లో తల పెట్టడం అనే వాక్యానికి సరిగ్గా సరిపోయే ఆశ్చర్యకరమైన ఉదంతం ఒకటి ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగింది.

2 వేల కిలోల మొసలి! అతడి తలను నోట పట్టినా...

క్యానెబెర్రా: చావు నోట్లో తల పెట్టడం అనే వాక్యానికి సరిగ్గా సరిపోయే ఆశ్చర్యకరమైన ఉదంతం ఒకటి ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగింది. ముప్పైమూడేళ్ల యువకుడొకరు ఇటీవల ఉత్తర క్వీన్స్‌ల్యాండ్ సమీపంలోగల లిజర్డ్ ద్వీపం సముద్ర తీరంలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. లోతైన ప్రాంతాల్లో స్విమ్మింగ్ చేయాలనేది అతడి అభిమతం. దురదృష్టవశాత్తూ.. అప్పటికే అతడి కోసం చావు నోరు తెరుచుకుని మరీ ఎదురు చూస్తోంది. 


అతడు నీళ్లలో దిగిన కొద్దిసేపటికే ఓ మొసలి అతడిపై దాడి చేసింది. తలతో పాటూ యువకుడి మెడ మొత్తం మొసలి నోటికి చిక్కాయి. సాధారాణ పరిస్థితుల్లో అయితే అతడు మొసలికి ఆహారమైపోవాల్సిందే. కానీ..ఆ సమయంలో ఎవ్వరూ ఊహించలేని ఓ అద్భుతం జరిగింది. తప్పించుకునేందుకు యువకుడు చేస్తున్న ప్రయాత్నాలకు దైవబలం కూడా తొడవ్వడంతో అతడు చావు అంచుల దాకా వెళ్లి వెనక్కొచ్చాడు. మొసలి పట్టు నుంచి విడిపించుకుని ఎట్టాగొట్టా ఒడ్డుకు చేరుకున్నాడు. 


యువకుడిని గమనించిన స్థానికులు. ముందుగా అతడికి ప్రాథమిక చికిత్స చేసి..ఆ తరువాత సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి స్థితి నిలకడగా ఉన్నప్పటికీ..తల, మెడపై తీవ్రమైన గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. ప్రాణాపాయం లేదని వారు భరోసా ఇచ్చారు. అయితే.. యువకుడి తలను మొసలి తన నోట పట్టినా తప్పించుకున్నాడంటే ఇది అద్భుతంగా భావించాలని వారు వ్యాఖ్యానించారు. 


ఇక.. సముద్రపు మొసళ్లు వెయ్యి నుంచి రెండు వేల కిలోల బరువు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటి నోటి కండరాల పటుత్వం అమోఘమని, ఈ మొసళ్ల నోటికి చిక్కితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని వారు హెచ్చరిస్తున్నారు. ఇక లిజర్డ్ ద్వీపంలో ఇటువంటి మొసలి దాడులు సాధారణమేనని అక్కడి అధికారులు తెలిపారు. 1985 నుంచి ఇప్పటివరకూ 37 మందిపై ఇవి దాడి చేయగా..11 ఘటనల్లో బాధితులు మృత్యువాత పడ్డారు. 

Updated Date - 2020-09-27T16:39:00+05:30 IST