దివ్యత్వం వైపు పయనిద్దాం!

ABN , First Publish Date - 2020-08-07T05:30:00+05:30 IST

సృష్టి పరిణామ క్రమంలో మానవుడి తరువాత రాబోయేది దివ్య మానవుడు. అది అనివార్యం, అది పరమేశ్వర సంకల్పం. అది తప్పదు! దానికి ఎంత కాలం పడుతుందనేది సాధకుడి ఆకాంక్షా తీవ్రతను బట్టి ఉంటుంది...

దివ్యత్వం వైపు పయనిద్దాం!

‘ఏకం సత్‌ - విప్రాః బహుధా వదంతి’ అని వేదోక్తి. ‘ఉన్నది ఒకటే సత్యం. పండితులు దాన్ని అనేక విధాలుగా చెప్పారు’ అని అర్థం.

‘తత్త్వమసి’ (తత్‌ - త్వం - అసి) అంటే ‘అది నీవే అయి ఉన్నావు’ అని చెప్పింది ఛాందగ్యోపనిషత్తు. 

‘అహం బ్రహ్మాస్మి’ అంటే ‘నేనే బ్రహ్మనై ఉన్నాను’ అని చెప్పింది బృహదారణ్యకోపనిషత్తు. ‘పరబ్రహ్మకూ, జీవాత్మకూ భేదం లేదు, రెండూ ఒకటే!’ అని అర్థం.

‘అయమాత్మా బ్రహ్మ (అయం - ఆత్మా- బ్రహ్మ) అంటే ‘ఈ ఆత్మయే పరబ్రహ్మ’ అని చెప్పింది మాండూక్యోపనిషత్తు.

‘ప్రజ్ఞానమ్‌ బ్రహ్మ’ అంటే ‘ప్రతి మానవునిలో (జీవిలో) ఉండే స్వస్వరూపానికి సంబంధించిన ఎరుకే బ్రహ్మ!’ అని చెప్పింది ఐతరేయోపనిషత్తు.

ఇది సర్వ ఉపనిషత్తుల సారం. జపమాల తిప్పుకొంటూ వీటన్నిటినీ వల్లె వేయడం వల్ల ప్రయోజనం లేదు. అంతర్ముఖులై, సాధన చేయడం ద్వారా అనుభవానికి వీటిని తెచ్చుకున్నప్పుడు మోక్షం లభిస్తుంది. అదే మానవుడై పుట్టినందుకు సార్థకత. 

సరే! ఎవరికి వారు ముక్తి పొందారు. మరి సమాజం మాట ఏమిటి? ఇక్కడే మనకు శ్రీ అరవిందుల వివరణ అవసరం అవుతుంది. పైన పేర్కొన్న ఉపనిషత్‌ వివరణలలో విశ్వం తాలూకు ప్రస్తావన లేదు. మానవుడు జన్మించక ముందూ విశ్వం (ప్రపంచం) ఉంది. అతడు పోయాకా ప్రపంచం ఉంటుంది. ఈ ప్రపంచం అవసరమే లేకుంటే ఇది ఉనికిలోకి ఎందుకు వచ్చింది?

ఆంజనేయస్వామికి శ్రీరాముడు తత్త్వబోధ చేస్తాడు. అది పూర్తయ్యాక, ‘‘ఆంజనేయా! ఇప్పుడు చెప్పు, నీవెవరివి?’’ అని ప్రశ్నిస్తాడు.

‘‘దేహబుధ్యాతు దాసోస్మిః, జీవబుధ్యా తత్వదంశకః, ఆత్మబుధ్యాతు త్వమేవాహం’’ అని బదులిస్తాడు ఆంజనేయుడు. అంటే ‘‘దేహమే నేననుకున్నప్పుడు నీ దాసుణ్ణి. నేనొక జీవుణ్ణి అనుకున్నప్పుడు నీలోని అంశను. ఆత్మయే నేననుకున్నప్పుడు నీవే నేను!’’ అని అర్థం. అన్నీ నిజమేగా!

‘దివ్య చేతన’ అంటే ‘పరతత్త్వం తనను తాను అనేకంగా ప్రకటించుకోవాలని సంకల్పించి (‘సోకామయత బహుస్యాం ప్రజాయే యేతి’- తైత్తరీయోపనిషత్తు) విశ్వంగా మారింది. వ్యక్తిగా రూపం దాల్చింది. అంటే ఒకే చేతన మూడు స్థాయులలో వ్యక్తిగా, విశ్వంగా, విశ్వాతీతంగా తనను తాను విస్తరించుకుంది. ముందుగా వ్యక్తి తనలోని చేతనతో తాదాత్మ్యం చెందాలి. ఆ తరువాత విశ్వ చేతనతో ఏకం కావాలి. అప్పుడు విశ్వాతీతంగా ఉన్న దివ్య చేతన ఈ రెండు స్థాయులతో తనంతట తాను అనుసంధానం చెందుతుంది. అలా జరిగినప్పుడు వ్యక్తిలోని శరీరం, జీవశక్తి, మనసు పూర్తిగా దివ్యతను సంతరించుకొని, రూపాంతరం చెందుతాయి. దివ్య చేతన తమ ద్వారా ప్రకటితం కావడం కోసం పారదర్శకంగా తయారవుతాయి. ఈ స్థాయికి మనం చేరుకున్నప్పుడు - దివ్య చేతన మనలో ఆవరించి, మన మనః ప్రాణదేహాలను రూపాంతరీకరిస్తుంది. అప్పుడు ఆ మానవ జీవితం దివ్య జీవనం అవుతుంది. సృష్టి పరిణామ క్రమంలో మానవుడి తరువాత రాబోయేది దివ్య మానవుడు. అది అనివార్యం, అది పరమేశ్వర సంకల్పం. అది తప్పదు! దానికి ఎంత కాలం పడుతుందనేది సాధకుడి ఆకాంక్షా తీవ్రతను బట్టి ఉంటుంది. ఈ భూమి మీద మానవుడు ఉనికిలోకి రావడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. దివ్య మానవుడి అవతరణకు కొన్ని వందల సంవత్సరాలు పడితేనేం! అందుకు ఇప్పుడు మార్గం ఏర్పడింది. సృష్టిలో అతి కీలకమైన ఘట్టానికి ఇప్పుడు మానవజాతి చేరుకుంది. దివ్య మానవుడి స్థాయికి చేరినప్పుడు... ఇప్పటి రోగాలూ, వ్యాధులూ, కష్టాలూ, సంకటాలూ, వ్యామోహాలూ, అధికారం కోసం పెనుగులాటలూ, కొట్లాటలూ, తరతమ భేదాలూ, స్వార్థం, అహంకారం, ఉగ్రవాదం, దోపిడీ లాంటివి ఉండవు. అంతా, అన్నీ తానే అయినప్పుడు అతనికి వెలితి ఏముంటుంది? కోరికలు ఎందుకు ఉంటాయి? ఎవరు ఎవర్ని ద్వేషిస్తారు? ఎవరు ఎవర్ని దోచుకుంటారు?

‘‘ఒక దివ్యమానవ సమాజం ఉనికిలోకి వస్తుంది. ఈ సకల సృష్టి ఆ దిశగానే పరిణామ క్రమంలో పయనిస్తోంది’’ అన్నారు శ్రీఅరవిందులు. ఆ దిశగా మనందరం అడుగులు వేద్దాం.

- కొంగర భాస్కరరావు







Updated Date - 2020-08-07T05:30:00+05:30 IST