హెల్మెట్‌లో పాము.. చూసుకోకుండా11కి.మీ. ప్రయాణం

ABN , First Publish Date - 2020-02-14T22:25:45+05:30 IST

కేరళకు చెందిన రంజిత్, సంస్కృత భాషా ఉపాధ్యాయుడు. అతడు రెండు పాఠశాలల్లో సంస్కృతం బోధిస్తుంటాడు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 5న కందనాడ్‌లోని మేరీ హైస్కూల్లో తరగతులు ముగించుకుని మరో స్కూల్‌కు ద్విచక్ర వాహనంపై ప్రయాణం అయ్యాడు. అయితే అతడు పెట్టుకున్న హెల్మెట్‌లో ఒక విషపూరిత సర్పం దూరింది

హెల్మెట్‌లో పాము.. చూసుకోకుండా11కి.మీ. ప్రయాణం

తిరువనంతపురం: ఓ వ్యక్తి తన తలపైనే విష సర్పాన్ని పెట్టుకొని 11 కిలోమీటర్లు ప్రయాణించాడు. గమ్యం చేరుకున్నాక కానీ చూసుకోలేదు అతడి తలపై ఏముందో.. తీరా చూసుకున్నాక తనకేం కానందుకు బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.


కేరళకు చెందిన రంజిత్, సంస్కృత భాషా ఉపాధ్యాయుడు. అతడు రెండు పాఠశాలల్లో సంస్కృతం బోధిస్తుంటాడు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 5న కందనాడ్‌లోని మేరీ హైస్కూల్లో తరగతులు ముగించుకుని మరో స్కూల్‌కు ద్విచక్ర వాహనంపై ప్రయాణం అయ్యాడు. అయితే అతడు పెట్టుకున్న హెల్మెట్‌లో ఒక విషపూరిత సర్పం దూరింది. అది చూసుకోకుండానే హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం సాగించాడు. మార్గ మధ్యంలో కూడా ఆయనకు ఎలాంటి అనుమానమూ రాలేదు. తీరా స్కూలుకు చేరుకున్నాక హెల్మెట్ తీసి చూసుకుంటే విష సర్పం కనిపించింది. అయితే అప్పటికే అది చనిపోయి, నుజ్జునుజ్జుయి ఉంది.


రంజిత్‌కు ఆ పాము నుంచి ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. అతడి సహోద్యోగులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడికి రక్త పరీక్ష చేశారు. అయితే ఆ పాము అతడిని కాటేయలేదని చెప్పారు. అయితే ఈ పాము తమ ఇంటి దగ్గర ఉన్న చెరువులో నుంచి తన హెల్మెట్‌లోకి వచ్చిందని రంజిత్ చెప్పారు.


కేరళలో ఈ మధ్య పాముల బెడదపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2019, డిసెంబర్‌లో ఓ వ్యక్తి బావిలో పడ్డ అనకొండను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ సహసికుడిని షంగీల్ అని తర్వాత తెలిసింది.

Updated Date - 2020-02-14T22:25:45+05:30 IST