నిండా ముంచిన గూగుల్ మ్యాప్స్.. వధువు గుర్తించడంతో తప్పిన పెను ముప్పు!

ABN , First Publish Date - 2021-04-11T00:23:09+05:30 IST

ఒకప్పుడు ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే వారినో, వీరినో అడిగి తెలుసుకుని వెళ్లేవారు. గూగుల్ మ్యాప్స్

నిండా ముంచిన గూగుల్ మ్యాప్స్.. వధువు గుర్తించడంతో తప్పిన పెను ముప్పు!

న్యూఢిల్లీ: ఒకప్పుడు ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే వారినో, వీరినో అడిగి తెలుసుకుని వెళ్లేవారు. గూగుల్ మ్యాప్స్ పుణ్యమా అని ఇప్పుడా బాధ తప్పింది. ఎంచక్కా స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఆన్‌చేసుకుని ఎవరినీ అడగకుండానే వెళ్లిపోతున్నారు. అత్యాధునిక సాంకేతికత జీవితాలను ఎంత హాయిగా మార్చిందో అదే స్థాయిలో ఒక్కోసారి కష్టాలను కూడా తెచ్చిపెడుతోంది.


ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి ఘటన గురించే. గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని పెళ్లి మండపానికి బయలుదేరిన వరుడు.. మరో వధువు మెడలో తాళికట్టబోయాడు. అయితే, వచ్చింది మనోళ్లు కాదని వధువు తరపు బంధువులు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


‘ట్రిబ్యూన్ న్యూస్’ కథనం ప్రకారం.. ఒక గ్రామంలో రెండు శుభకార్యాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి వివాహం కాగా, రెండోది నిశ్చితార్థం. గందరగోళానికి ఇదే కారణమైంది. వధువు మేకప్ వేసుకోవడంలో బిజీగా ఉండడంతో ఈ విషయాన్ని తొలుత గ్రహించలేకపోయింది. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లికొచ్చిన కుటుంబం బహుమతులతో పెళ్లి మండపాన్ని వదిలిపెడుతున్న దృశ్యాలు ఉన్నాయి.  


సెంట్రల్ జావాలోని పాకీస్ జిల్లా లోసారి హామ్లెట్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. గూగుల్ మ్యాప్స్ ఆన్‌చేసి బయలుదేరిన వరుడి కుటుంబం సరాసరి జెంగ్‌కోల్ హామ్లెట్‌కి వెళ్లింది. ఇది లోసారి హామ్లెట్‌కు అత్యంత సమీపంలోనే ఉంది. అక్కడి వేదిక కూడా బంధువులతో హడావుడిగా ఉంది. నిజానికి అక్కడ మారియా ఉల్ఫాకు ఆమె కాబోయే భర్త బుర్హాన్ సిద్దిఖీతో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. వరుడి తరపు వారి కోసం మారియా ఉల్ఫా, ఆమె కుటుంబం ఎదురుచూస్తోంది. 


ఈలోపు పెళ్లి దుస్తుల్లో వచ్చిన వరుడిని, అతడి కుటుంబ సభ్యులను చూసి ఉల్ఫా విస్తుపోయింది. ఆ తర్వాత వారు తన కోసం వచ్చిన వారు కాదని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది. తన కాబోయే భర్త కుటుంబ సభ్యులు కెండాల్ నుంచి రావాల్సి ఉండగా, వీరు పెమలాంగ్ నుంచి వచ్చారని తెలుసుకుంది. ఎక్కడో తేడా జరిగిందని ఆరా తీస్తుండగా అసలు విషయం తెలిసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. 


తాము గూగుల్ మ్యాప్స్ లొకేషన్‌ను ఆన్ చేసుకుని వచ్చామని చెప్పారు. దీంతో అదే వారి కొంప ముంచిందని ఆలస్యంగా తెలుసుకుని అక్కడి నుంచి ఈసురోమంటూ మళ్లీ బయలుదేరారు. దారితప్పి వచ్చిన వేరే వరుడి కుటుంబ సభ్యులను ఉల్ఫా కుటుంబ సభ్యులు అసలు వేదిక వద్దకు తీసుకెళ్లడంతో కథ పరిసమాప్తమైంది. అయితే, ఇదంతా ఓకే కానీ.. తాము వేరే ఇంటికి వచ్చినట్టు పెళ్లికొడుకు ఎందుకు గుర్తించలేకపోయడబ్బా.. అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Updated Date - 2021-04-11T00:23:09+05:30 IST