జెల్లీ ఫిష్ అనుకుని నాకి.. ప్రాణాలు పోగొట్టుకోబోయాడు!

ABN , First Publish Date - 2021-05-10T02:08:52+05:30 IST

సముద్రం ఒడ్డున కనిపించి ఓ సన్నని, అందంగా ఉన్న జీవిని పట్టుకుని ఆటాడుకున్న ఓ వ్యక్తి దానిని జెల్లీ ఫిష్

జెల్లీ ఫిష్ అనుకుని నాకి.. ప్రాణాలు పోగొట్టుకోబోయాడు!

న్యూఢిల్లీ: సముద్రం ఒడ్డున కనిపించి ఓ సన్నని, అందంగా ఉన్న జీవిని పట్టుకుని ఆటాడుకున్న ఓ వ్యక్తి దానిని జెల్లీ ఫిష్ అనుకుని నాకి చావు అంచులకు వెళ్లి అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. అది ఓ ప్రమాదకర జీవి అని, అది తన ప్రాణాలను బలిగొంటుందని అతడు తెలుసుకోలేకపోయాడు. 


అలెక్జా రీడ్2 అనే టిక్‌టాక్ యూజర్ ఈ వీడియోను పోస్టు చేశాడు. బీచ్ ఒడ్డున నీళ్లలో ఎగురుతున్న ఆ జీవిని చూసిన టిక్‌టాకర్.. అది బెలూన్ బ్లూ రంగులో పారదర్శకంగా కనిపించడంతో ముచ్చటపడి చేతుల్లోకి తీసుకున్నాడు. దానిని చేతితో పట్టుకున్న యువకుడు ‘‘చూడండి గైస్ జెల్లీ ఫిష్ ఇక్కడుంది. దీనిని నేను ఇప్పుడు నాకబోతున్నా’’ అని చెప్పాడు. ‘‘ఇది ఎలా కనిపిస్తోంది. అవును, ఇదో జెల్లీ ఫిష్. ఎంత పెద్దగా ఉందో కదా. ఇంకా కదులుతోంది. ఓ మై గాడ్.. దీనిని ఇప్పుడు నాకబోతున్నా’’ అని చెప్పుకొచ్చాడు. 


నిజానికి అది జెల్లీ ఫిష్ కాదు. మనుషుల్ని చంపగలిగేంత శక్తి ఉన్న జీవి అది. దీనిని పోర్చుగీస్ మ్యాన్ ఓ’ అంటారు. దీనికి మరో పేరు ‘ఫ్లోటింగ్ టెర్రర్’. ఆ వీడియో వీడియో చూసిన నెటిజన్లు అతడిని తీవ్రంగా హెచ్చరించారు. నువ్వు చాలా అదృష్టవంతుడివని, అది జెల్లీ ఫిష్ కాదని పేర్కొన్నారు.


  ‘‘ఇది జెల్లీఫిష్ కాదు. పోర్చుగీస్ మ్యాన్ ఓ’. ‘బ్లూ బాటిల్‌’, ‘ఫ్లోటింగ్ టెర్రర్’ అనే పేర్లతోనూ దీనిని పిలుస్తారు. ఒక్క ఆస్ట్రేలియాలోనే దీని బారిన ఏడాదికి 10 వేల మంది పడుతున్నారు. దాని విషం చాలా ప్రమాదకరమైనది. అది కుడితే కనుక ఆ తీవ్రమైన బాధ మూడు రోజులుంటుంది. స్పృహ కోల్పోతారు. సకాలంలో వైద్యం అందకుంటే ప్రాణాలే పోతాయి. అయినప్పటికీ వెన్నుపూస అదిరిపోయేంత బాధను భరించాల్సి ఉంటుంది’’ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.


ఇది సిఫోనోఫోర్ జాతికి చెందినదని, ఇది కుడితే కనుక ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయమని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ‘‘నిజం చెప్పాలంటే నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. దాని విషం చాలా ప్రమాదకరం. గొంతువాపు, హృద్రోగ సమస్యలు, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది. ఇంకా చెప్పాలంటే చనిపోవడం ఖాయం’’ అని ఆ ప్రమాదకర జీవి గురించి వివరించాడు. దాని టెంటకిల్స్ శరీరానికి తాకినా ప్రమాదమేనని పేర్కొన్నాడు. 

Updated Date - 2021-05-10T02:08:52+05:30 IST