మందు మన చేతుల్లోనే...

ABN , First Publish Date - 2020-05-29T05:30:00+05:30 IST

జీవ పరిణామక్రమంలో మనిషి కూడా జంతు జాతికి చెందినవాడే. అయినా మెదడు, మనస్సు, ఆలోచనలు, ఈర్ష్య, ద్వేషం, కోపాలతో పాటు దయ, జాలి, కరుణ, మానవీయ లక్షణాలు మనిషిని ఒక ప్రత్యేక జీవిగా...

మందు మన చేతుల్లోనే...

జీవ పరిణామక్రమంలో మనిషి కూడా జంతు జాతికి చెందినవాడే. అయినా మెదడు, మనస్సు, ఆలోచనలు, ఈర్ష్య, ద్వేషం, కోపాలతో పాటు దయ, జాలి, కరుణ, మానవీయ లక్షణాలు మనిషిని ఒక ప్రత్యేక జీవిగా రూపుదిద్దాయి. కోపతాపాలూ, కామ మోహాలూ అన్ని జీవులకూ ఉంటాయి. కానీ, మానవీయ గుణాలు ఒక్క మనిషికే ఉంటాయి. అంటే మనిషి - అటు జంతుజాల లక్షణాలూ, ఇటు తాను రూపొందించుకున్న మానవీయ లక్షణాలూ కలగలిసిన ఉమ్మడి లక్షణాలు కలిగిన జీవి అన్నమాట.


పశు లక్షణాలను పట్టి బంధిస్తేనో, కళ్ళెమో, ముక్కుతాడో వేస్తేనో కానీ నిలువరించలేం. అవి మనల్ని హద్దులు దాటిస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి ఎంతో కొంత నిర్బంధమో, నియమ నిబంధనలో, శిక్షలో అవసరం. అంటే నియంత్రణ అవసరం. మానవ సమాజంలో ఈ నియంత్రణ సామాజికమైన ఉమ్మడి బాధ్యత. ఈ బాధ్యతలను రాజ్యం, రాజ్యాంగం, రక్షణ వ్యవస్థ, ప్రభుత్వాలు తీసుకుంటాయి. వీటిని మనం ‘సామాజిక నియంత్రణలు’ అంటాం. చట్టాలు, కట్టుబాట్లు ఈ పని నిర్వహిస్తాయి. మనిషి మీద అజమాయిషీ చేస్తాయి. మనిషిని కట్టడి చేస్తాయి. ఇదే మనిషిపై ఉండే సామాజిక నియంత్రణ (స్టేట్‌ కంట్రోల్‌). ఈ నియంత్రణను మనిషి స్వేచ్ఛకు భంగంగా కొందరు భావిస్తారు. అది నిజం కూడా! ఈ నియంత్రణే నియంతృత్వానికి దారి తీస్తుంది. నియంతలను సృష్టిస్తుంది. కాబట్టి ‘‘మనిషికి స్వేచ్ఛ ఉండాలి’’ అంటారు ఎంతోమంది! ఇలా ప్రపంచంలో తత్త్వవేత్తలు రెండు రకాలుగా విడిపోయారు. ‘‘స్వేచ్ఛ అనేది చాలా ప్రమాదకరమైనది. స్వేచ్ఛ ముదిరితే మరొకరి స్వేచ్ఛకు పెనుముప్పు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి స్వేచ్ఛను కాంక్షించే వారికి స్వీయ నియంత్రణ (సెల్ఫ్‌ కంట్రోల్‌) ఉండాలి’’ అంటారు కొందరు. వీరిలో మొదటివాడు బుద్ధుడు.


బుద్ధుడు అతి నియంత్రణను ఎలా అంగీకరించలేదో, అతి స్వేచ్ఛను కూడా అంతగానే అంగీకరించలేదు. ఈ రెండిటికీ మధ్యే మార్గంగా తన ధర్మాన్ని రూపొందించి, దాని మీద బౌద్ధ సంఘాన్ని నిర్మించాడు. బౌద్ధ సంఘంలో భిక్షువులకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిపై పర్యవేక్షణ కూడా ఉంటుంది. అవి కఠోరంగా ఉండవు. శిక్షణకు అనుకూలంగానే ఉంటాయి. శిక్షణలో దశలు కూడా ఉంటాయి. అలా సంఘం నిబంధనలకు లోబడి భిక్షువులు పని చేయాలి. జీవించాలి.

అలాగనీ ఏడాది పొడుగునా వారిని అలా పర్యవేక్షించడం ఉండదు. ఓ నాలుగు నెలలు వ్యక్తిగతంగా స్వేచ్ఛతో జీవించే అవకాశం ఉంది. ఇది వర్షావాసంలో ఒక భాగం కూడా! వర్షావాసం గడిపే భిక్షువు ఒంటరిగా ఏ మారుమూల ప్రాంతాలకో వెళ్ళిపోవాలి. అడవుల్లోనో, కొండల్లోనో గడపాలి. ఆ సమయంలో తనను తాను పరీక్షించుకోవాలి. అతనిపై సంఘ నియంత్రణ ఉండదు. స్వీయ నియంత్రణ ఉంటుంది. ఆ సమయంలో ఎవరు స్వీయ నియంత్రణ చేసుకొని, తనలో జ్ఞాన, ధ్యాన శక్తిని ఇనుమడింపజేసుకుంటారో వారే ఉత్తమ భిక్షువులుగా రాణిస్తారు. ఇది ఒక రకమైన పరీక్ష లాంటిదే! స్వేచ్ఛతో జరిపే పరీక్ష. స్వేచ్ఛపై ఎంత నియంత్రణ ఉందో తెలుసుకొనే పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గినవారే ఉత్తమ భిక్షువులుగా నిలబడతారు. 


ఇప్పుడు మనం కూడా ఈ స్వేచ్ఛా పరీక్షను ఎదుర్కొనే దశలో ఉన్నాం. ఆ పరీక్ష ఇప్పుడే మొదలైంది. అవును! నిన్నటి దాకా కరోనాపై ప్రభుత్వ నియంత్రణ ఉంది. అంటే ‘స్టేట్‌ కంట్రోల్‌’లో నడిచాం. ఇక ఇప్పుడు స్వీయ నియంత్రణలో నడవాలి. ‘స్వీయ నియంత్రణ’ అంటే విచ్చలవిడితనం కాదు. బరితెగింపు లేని స్వీయ బంధనం. ఇప్పుడు మనం స్వీయ నియంత్రణను మరచిపోతే, మన చావుకు మనమే ఆహ్వానం పలికినవారమవుతాం.

‘‘సంఘ నియంత్రణ అవసరమే. అయితే దానికన్నా స్వీయ నియంత్రణే గొప్పది’’ అని బుద్ధుడు చేసిన ప్రబోధం ఇప్పుడు ఈ ప్రపంచానికి ఏకైక మార్గం. అదే కరోనా కట్టడికి మన చేతుల్లో ఉన్న దివ్య ఔషధం.

-బొర్రా గోవర్ధన్‌


Updated Date - 2020-05-29T05:30:00+05:30 IST