ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని కలలు కనిందా యువతి. అతను ఎక్కడ దూరమవుతాడో అని భయపడింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. అది భరించలేని ప్రియుడు పక్కా ప్లాన్‌తో ఆమెను కడతేర్చాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతంలో వెలుగు చూసింది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో 22 ఏళ్ల ఒక యువతి పనిచేస్తోంది. అక్కడే పనిచేసే రిజ్వాన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీళ్లిద్దరి ప్రేమాయణం కొంతకాలంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అతనిపై ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. దాంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని అనుకున్న రిజ్వాన్.. ఆన్లైన్లో రెండు ఇంజెక్షన్లు ఆర్డర్ ఇచ్చాడు.
ప్రియురాలిని కూడా ఇంటికి పిలిచాడు. అతను రమ్మనడంతో అక్కడకు వెళ్లిన ఆమెకు రెండు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ఇంట్లో యువతి శవం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ రెండు ఇంజెక్షన్ సిరంజిలు వారికి లభించాయి. యువతి మరణించడానికి ముందు, అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారని వారు గుర్తించారు. దర్యాప్తులో మృతురాలికి రిజ్వాన్ అనే యువకుడితో ప్రేమాయణం సాగుతోందని తెలిసింది. అతన్ని పట్టుకొని ప్రశ్నించగా నిజం ఒప్పేసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో తనే ఆమెను చంపేసినట్లు అంగీకరించాడు. రిజ్వాన్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి