ప్రేమే నేరమౌనా? పెళ్ళే పాపమౌనా?

ABN , First Publish Date - 2020-05-23T05:30:00+05:30 IST

ప్రేమ గొప్పదనాన్ని వర్ణించే కావ్యాలకూ, కవితలకూ, కథలకూ, సినిమాలకూ కాలదోషం లేదు. భూమి ఉన్నంత వరకూ ప్రేమ, ప్రేమికులూ ఉంటూనే ఉంటారు. కానీ ఈ కరోనా వేళ ప్రేమికులు విరహాన్ని భరించాలే తప్ప వివాహం కోసం దూకుడుగా...

ప్రేమే నేరమౌనా? పెళ్ళే పాపమౌనా?

ప్రేమ గొప్పదనాన్ని వర్ణించే కావ్యాలకూ, కవితలకూ, కథలకూ, సినిమాలకూ కాలదోషం లేదు. భూమి ఉన్నంత వరకూ ప్రేమ, ప్రేమికులూ ఉంటూనే ఉంటారు. కానీ ఈ కరోనా వేళ ప్రేమికులు విరహాన్ని భరించాలే తప్ప వివాహం కోసం దూకుడుగా పోకూడదని ఆత్మానుభవంతో చెబుతున్నాడు ఓ ఒరియా బాబు. 


ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా పలాసియా గ్రామానికి చెందిన ఈ కుర్రాడు బెంగళూరులో పని చేస్తున్నాడు. ఒడిశాపొరుగునే ఉన్న పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయీ, అతనూ గాఢంగా ప్రేమించుకున్నారు. నానా కష్టాలూ పడి, తమ పెళ్ళికి పెద్దలను ఒప్పించారు కూడా!  మొన్న ఏప్రిల్‌ 17న పెళ్ళి చేయడానికి ముహూర్తాలు కూడా కుదిరాయి. ఈలోగా మాయదారి కరోనా వచ్చి దేశం మీద పడింది. ఎలా అప్రమత్తం అయ్యాడో కానీ, గత మార్చి ఆఖరివారంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ముందే బెంగళూర్‌ నుంచీ మన హీరో జాగ్రత్తగా సొంతూరు వచ్చి పడ్డాడు. అతనూ, అతని ప్రేయసీ ఆడియో, వీడియో ఛాటింగులు చేస్తూ, పెళ్ళి కలలు కంటున్నా లాక్‌డౌన్‌ వల్ల అది నెరవేరేలా కనిపించలేదు. పెళ్ళిళ్ళూ, శుభకార్యాల మీద ఆంక్షలు విధించడం మాట అటుంచితే, రాష్ట్రాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ఇదే కష్టం అనుకుంటే, అతని ప్రేమికురాలు ఉంటున్న తూర్పు మిడ్నాపూర్‌ జిల్లా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని కరోనా హాట్‌ స్పాట్స్‌లో ఒకటిగా నిలిచింది. 


బయట మండుటెండలూ, ఒంట్లో విరహం వేడెక్కిస్తూంటే... కరోనా కాదు దాని బాబొచ్చినా ప్రేమను బెదిరించలేదనీ, హద్దులు గీయలేదనీ, ప్రేయసితో తను ఒక్కటి కాకుండా ఆపలేదనీ ఆ యువకుడు తీర్మానించేసుకున్నాడు. పదహారు బైకుల మీద దాదాపు 30 మందిని తీసుకొని, రాష్ట్ర సరిహద్దులూ, జిల్లా ఎల్లలూ, లాక్‌డౌన్‌ ఆంక్షలూ, కరోనా భయాలూ దాటేసి, ప్రేమికురాలి ఊరు చేరాడు. అనుకున్న ముహూర్తానికే తాళి కట్టేశాడు. ప్రేమను గెలిపించేశాడు. తరువాత సతీ సమేతంగా సొంత ఊరు వచ్చేశాడు. 


మూడు వారాల్లోనే అతనికి ఒంట్లో నలత చేయడంతో, వైద్యుల దగ్గిరకు వెళితే ‘‘కరోనా పాజిటివ్‌ నాయనా!’’ అని చావు కబురు చల్లగా చెప్పారు. అతనికి వైరస్‌ ఎలా సోకిందని ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది. అతను కలుసుకున్న వారి లెక్క కనీసం 160 మందికి పైగానని తేలింది. వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి పరీక్షలు మొదలెట్టింది. ఇంకా ఎంతమంది ఉన్నారోనని లెక్కలు తీస్తోంది. అతని పెళ్ళికి వెళ్ళిన వారితో పాటు వ్యవసాయ పనుల్లో అతనితోపాటు పాల్గొన్నవారూ, స్నేహితులూ... ఇలా ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు!అయితే, అతని ప్రియమైన భార్యకూ, వదినకు నెగెటివ్‌ రావడం విశేషం! 


తమ కన్ను కప్పి జిల్లాలూ, రాష్ట్రాలూ దాటి, అంత మంది జనంతో వెళ్ళి, పెళ్ళి పూర్తి చేసుకొని అతను ఎంచక్కా ఎలా వెనక్కి రాగలిగాడని పోలీసులు ఒకవైపు జుట్టు పీక్కుంటూ ఉంటే, మనోడు ‘‘ప్రేమే నేరమౌనా? పెళ్ళే పాపమౌనా?’’ అని పాడుకుంటూ క్వారంటైన్లో కాలం వెళ్ళదీస్తున్నాడు. 

ఈ కథ విన్నాకైనా ప్రేమ శక్తి కన్నా కరోనా పవర్‌ గట్టిదని ప్రేమికులు నమ్మాల్సిందే మరి!

Updated Date - 2020-05-23T05:30:00+05:30 IST