క్వారంటైన్‌లో ఉన్న భర్త.. రోడ్డు ప్రమాదంలో మరణించిన భార్య, కూతురు..

ABN , First Publish Date - 2020-05-27T03:36:59+05:30 IST

భార్య, కూతురు చనిపోవడంతో ఆచార కార్యక్రమాలు చేసేందుకు క్వారంటైన్‌లో

క్వారంటైన్‌లో ఉన్న భర్త.. రోడ్డు ప్రమాదంలో మరణించిన భార్య, కూతురు..

హైదరాబాద్: భార్య, కూతురు చనిపోవడంతో ఆచార కార్యక్రమాలు చేసేందుకు క్వారంటైన్‌లో ఉన్న భర్తకు అధికారులు ఒకరోజు అనుమతిచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన పోతురాజుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం కొద్ది నెలల క్రితం దుబాయికి వెళ్లాడు. మే 15న శ్రీనివాస్ భార్య, పెద్ద కూతురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. భారత్‌కు వచ్చే అవకాశం లేకపోవడంతో వీడియో కాల్‌లోనే శ్రీనివాస్ తన భార్య, కూతురు అంత్యక్రియలను చూడాల్సి వచ్చింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విమానంలో అనంతరం శ్రీనివాస్ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అయితే విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో చేసేది లేక శ్రీనివాస్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా నాంపల్లిలోని క్వారంటైన్‌కు వెళ్లిపోయాడు. 


అయితే భార్య, కూతురుకు సంబంధించిన కొన్ని ఆచార కార్యక్రమాలు చేసేందుకు ఇంటికి వెళ్లేలా అనుమతివ్వాలని శ్రీనివాస్‌ తెలంగాణ జాగృతిని సంప్రదించాడు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, చీఫ్ సెక్రటరి సోమేష్ కుమార్‌ల సాయంతో మంచిర్యాల వెళ్లేందుకు శ్రీనివాస్‌కు అనుమతి వచ్చింది. దీంతో మే 24న ప్రత్యేక వాహనంలో శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. ఇంటికి అయితే వెళ్లాడు కాని.. తన చిన్న కూతురిని కనీసం ముట్టుకోవడం కూడా కుదరలేదు. పైనున్న ఫొటోను చూస్తే శ్రీనివాస్ ఒక వైపు కూర్చుంటే.. ఆయన రెండో కూతురు మరోవైపు కూర్చుని ఉన్నారు. కార్యక్రమాల అనంతరం అధికారులు శ్రీనివాస్‌ను తిరిగి క్వారంటైన్‌కు తీసుకెళ్లారు. తన భార్య, బిడ్డల కోసమే దుబాయి వెళ్లానని.. ఇప్పుడు వారే తన నుంచి దూరమయ్యారని శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక తాను దుబాయికి వెళ్లనని ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తానని చెప్పాడు.

Updated Date - 2020-05-27T03:36:59+05:30 IST