9/11 ఫొటోలతో ఫేమస్ అయిన కూపర్ కరోనాతో మృతి

ABN , First Publish Date - 2020-07-05T21:34:31+05:30 IST

అమెరికాలో సెప్టెంబరు 11, 2001న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి గురించి తెలియని వారుండరు.

9/11 ఫొటోలతో ఫేమస్ అయిన కూపర్ కరోనాతో మృతి

న్యూయార్క్: అమెరికాలో సెప్టెంబరు 11, 2001న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి గురించి తెలియని వారుండరు. అకస్మాత్తుగా జరిగిన దాడితో భయభ్రాంతులకు గురైన జనం పరుగులు తీశారు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటో అప్పట్లో వైరల్ అయింది. ఆ ఫొటోలో వెనక దట్టంగా అలముకున్న పొగ, శిథిలాలు కనిపిస్తుండగా, ముందు పరుగులు తీస్తున్న వారి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలో భయంతో పరుగులు తీస్తున్న వ్యక్తుల్లో ఒకరి పేరు స్టీఫెన్ కూపర్. న్యూయార్క్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీర్. ఫ్లోరిడాలోని డెల్రే బీచ్‌లో నివసిస్తుంటాడు. మార్చి 28న అతడు డెల్రే మెడికల్ సెంటర్‌లో కరోనాతో ప్రాణాలు విడిచినట్టు ‘పామ్ బీచ్ పోస్ట్’ తెలిపింది. అతడి వయసు 78 సంవత్సరాలని తెలిపింది.

 

అసోసియేటెడ్ ప్రెస్ ఫొటో ప్రెస్ ఫొటోగ్రాఫర్ తీసిన ఈ ఫొటో ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యాగజైన్లు, న్యూస్‌పేపర్లలో ప్రచురితమైంది. న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్ మ్యూజియంలోనూ ఇదే ఫొటో ఉంది. నిజానికి తన ఫొటో తీసిన విషయం కూపర్‌కు తెలియదని 33 ఏళ్లుగా జీవిత భాగస్వామిగా ఉన్న జానెట్ రాషెస్ పేర్కొన్నారు. ఒకరోజు అతడు మ్యాగజైన్‌పై ఉన్న తన ఫొటోను చూస్తూ.. ‘ఓ మై గాడ్.. అది నేనే’ అంటూ ఆశ్చర్యపోయాడని ఆమె వివరించారు.


ఘటన జరిగిన రోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలో వద్ద డాక్యుమెంట్ల డెలివరీ పనిలో ఉన్నాడని, ఉగ్ర ఘటన గురించి అతడికి తెలియకున్నా.. ‘పరిగెత్తండి’ అన్న పోలీసుల అరుపులతో అతడు పరిగెట్టినట్టు పేర్కొన్నారు. ఎడమ చేతితో ఎన్వలప్ కవర్ పట్టుకున్న కూపర్‌తోపాటు మరికొందరు పరుగులు తీయడం ఆ ఫొటోలో కనిపిస్తోంది. వారి వెనక దట్టమైన పొగ, టవర్ కూలుతున్న దృశ్యం ఉంది. 

Updated Date - 2020-07-05T21:34:31+05:30 IST