85 రోజులుగా అప్పన్న సన్నిథిలో రాచమర్యాదలు.. ఎవరా అతిథి..?

ABN , First Publish Date - 2020-08-22T18:05:25+05:30 IST

అతనెవరో...హోదా ఏమిటో...ఎవరికీ తెలియదు. చైర్‌పర్సన్‌ మౌఖికంగా ఆదేశించారంటూ సింహాచలం అప్పన్న సన్నిధిలోని కాటేజీలో వసతి కల్పించారు. రాచమర్యాదలు చేస్తున్నారు. ఒకటీ, రెండు రోజులు కాదు...ఏకంగా 85 రోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు.

85 రోజులుగా అప్పన్న సన్నిథిలో రాచమర్యాదలు.. ఎవరా అతిథి..?

అప్పన్న సన్నిధిలో రాచమర్యాదలు

85 రోజులుగా కాటేజీలో తిష్ఠ

భోజన వసతి సౌకర్యాలందిస్తున్న సిబ్బంది

ఆలయ ఆదాయానికి రూ.లక్షల్లో గండి

అనధికారికంగా దేవస్థానం రికార్డుల పరిశీలన 

దేవస్థానంలో హాట్‌టాపిక్‌గా మారిన వైనం 


సింహాచలం(విశాఖపట్టణం): అతనెవరో...హోదా ఏమిటో...ఎవరికీ తెలియదు. చైర్‌పర్సన్‌ మౌఖికంగా ఆదేశించారంటూ సింహాచలం అప్పన్న సన్నిధిలోని కాటేజీలో వసతి కల్పించారు. రాచమర్యాదలు చేస్తున్నారు. ఒకటీ, రెండు రోజులు కాదు...ఏకంగా 85 రోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు. అంతేకాదు దేవస్థానం రికార్డులను తన గదికే రప్పించుకుని మరీ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సింహాచలం దేవస్థానంలో ఇదే హాట్‌ టాపిక్‌.


సింహగిరిపై వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన అన్నపూర్ణమ్మ సదన్‌కు కార్తీక్‌ అనే వ్యక్తి ఈ ఏడాది మే 30న వచ్చారు. దేవస్థానం పాలక మండలి చైర్‌పర్సన్‌ పూసపాటి సంచయిత గజపతి మౌఖికంగా ఆదేశాలు జారీచేయడంతో కార్తీక్‌కు అప్పటి ఈఓ మారెళ్ల వెంకటేశ్వరరావు వసతి సౌకర్యం కల్పించారని చెబుతున్నారు. కాగా ఈ కార్తీక్‌...సంచయిత గజపతి పీఎస్‌గా ప్రచారం జరుగుతోంది. అయితే కాటేజీలో చేరిన అతను ఒకటి, రెండు రోజులు వుండి వెళ్తారని అంతా భావించారు. కానీ సుమారు 85 రోజులుగా అక్కడే తిష్ఠ వేశారు. ప్రతిరోజూ అతనికి దేవస్థానం సిబ్బంది రెండు పూటలా భోజనాదులు సమకూరుస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు సిబ్బంది పనిచేస్తున్నారు. దేవస్థానం ఇతరులెవ్వరికీ వసతి, భోజనాది సదుపాయాలు ఉచితంగా అందజేయకూడదనేది నిబంధన. కానీ అందుకు విరుద్ధంగా అతడికి రాచమర్యాదలు అందుతున్నాయి. అంతేకాకుండా దేవస్థానానికి సంబంధించిన రికార్డులన్నీ కాటేజీకి రప్పించుకుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏ హోదాతో రికార్డులను పరిశీలిస్తున్నారో అంటూ సిబ్బంది చర్చించుకుంటున్నారు. కరోనా ప్రభావంతో దేవస్థానం ఆర్థిక ఇబ్బందుల్లో వుందనే కారణం చూపి ట్రస్టు బోర్డు అనుమతి లేకుండా ఏకపక్షంగా 183 మంది సిబ్బందిని తొలగించిన చైర్‌పర్సన్‌ దేవస్థానానికి సంబంధం లేని వ్యక్తిని కాటేజీలో బస చేసేందుకు ఎలా ఆదేశిస్తారనేది ప్రశ్నిస్తున్నారు. 


ఖజానాకు రూ.లక్షల్లో నష్టం 

కాటేజీలో కార్తీక్‌ను వుంచడంతో అద్దె రూపంలో రోజుకు రూ.2950, జీఎస్టీతో కలిపి ఇప్పటివరకు సుమారు రూ.2.4 లక్షలు అప్పన్న ఖజానాకు నష్టం వాటిల్లింది. దీనికితోడు భోజనాలు, అతడి అవసరాలకు ఏర్పాటుచేస్తున్న వాహనాల ఖర్చు, సేవలందించే సిబ్బంది జీత భత్యాలు అదనం. ఈ వ్యవహారంపై కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబను వివరణ కోరగా గత ఈఓ వెంకటేశ్వరరావు హయాంలోనే కార్తీక్‌కు కాటేజిని కేటాయించారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు.

Updated Date - 2020-08-22T18:05:25+05:30 IST