ఒకడి ముఖం పగలకొట్టాలి.. అనుమతివ్వమంటూ అధికారులకు లేఖ.. ఫ్రాన్స్‌లో..

ABN , First Publish Date - 2020-11-25T04:35:09+05:30 IST

ఫ్రాన్స్‌లో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. ప్రభుత్వ అనుమతి

ఒకడి ముఖం పగలకొట్టాలి.. అనుమతివ్వమంటూ అధికారులకు లేఖ.. ఫ్రాన్స్‌లో..

పారిస్: ఫ్రాన్స్‌లో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. ప్రభుత్వ అనుమతి లేనిదే ఏ ఒక్కరు బయటకు రాకూడదు. అత్యవసర పనిమీద ఎవరైనా బయటకు రావాలంటే హోంశాఖకు లేఖ రాయాల్సి ఉంటుంది. లేఖలో పేరు, అడ్రస్, సమయం, ఎక్కడికి వెళ్లేది అన్ని వివరాలను రాయాల్సి ఉంటుంది. బ్రిటనీలోని ల్యానియన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కూడా తాను బయటకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ హోంశాఖకు లేఖ రాశాడు. అయితే ఈ లేఖను చదివిన అధికారులు కంగుతిన్నారు. సహజంగా అందరూ వైద్యుడి దగ్గరకో, ఆఫీసుకో, షాపింగ్‌కో వెళ్లేందుకు అనుమతి కోరుతూ లేఖ రాస్తే.. సదరు వ్యక్తి మాత్రం ఒక వ్యక్తి ముఖం పగలకొట్టేందుకు అనుమతి కావాలంటూ లేఖ రాశాడు. 


ఈ లేఖను చదివిన వెంటనే అధికారులు సదరు వ్యక్తి వెళ్లిన అడ్రస్‌కు చేరుకున్నారు. ఓ కారు వెనుక ఉన్న వ్యక్తిని అధికారులు గుర్తించారు. ఏం చేస్తున్నావని అధికారులు ప్రశ్నించగా.. కొంతమంది వ్యక్తుల ముఖం పగులగొట్టేందుకు ఎదురుచూస్తున్నానంటూ సమాధానమిచ్చాడు. సరైన కారణం లేకుండా బయటకు రావడం వల్ల సదరు వ్యక్తికి అధికారులు 135(రూ. 11,864) యూరోల జరిమానాను వేశారు. అంతేకాకుండా మద్యం సేవించి ఉండటంతో మరో 150 యూరోల(రూ. 13,188) జరిమానాను కూడా విధించారు. సదరు వ్యక్తి దగ్గర కత్తి కూడా ఉండటంతో మరింత జరిమానా పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-11-25T04:35:09+05:30 IST