ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..!

ABN , First Publish Date - 2020-10-09T17:37:11+05:30 IST

సెల్ఫీ సరదా పాతికేళ్ల యువకుడి ప్రాణాలు తీసింది.

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..!

అరిజోనా: సెల్ఫీ సరదా పాతికేళ్ల యువకుడి ప్రాణాలు తీసింది. అరిజోనా కొండ అంచున నిలబడి ఫొటో తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారీ 250 అడుగుల ఎత్తు నుంచి కిందపడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన అమెరికాలోని అరిజోనాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఓర్లాండో సెరానో అర్జోలా(25) అనే యువకుడు ఆదివారం అరిజోనా కొండపైకి వెళ్లాడు. అక్కడ కొండ అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో కాలు జారీ కింద పడ్డాడు. సమారు 250 అడుగుల ఎత్తు నుంచి అతడు కిందపడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


అరిజోనా పేజ్ సమీపంలో ఉన్న ఈ కొండ పక్కనే కొలరాడో నదిపై గ్లెన్ కాన్యన్ డ్యామ్ ఉంది. సెరానో కొండ అంచుపై నిలబడి సెల్ఫీ తీసుకునే సమయంలో డ్యామ్‌వైపు చూసి ఉంటాడని... అందుకే ప్రమాదం జరిగి ఉంటుందని కోకోనినో కౌంటీ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, కొండ అడుగు భాగం నుంచి సెరానో మృతదేహాన్ని పైకి తీసుకురావడానికి వెళ్లిన పోలీసులకు అదే ప్రాంతంలో మరో మృతదేహానికి సంబంధించిన అవశేషాలు లభించాయి. ఈ రెండు మరణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కోకోనినో కౌంటీ పోలీస్ కార్యాలయ ప్రతినిధి జోన్ పాక్స్టన్ తెలిపారు.  

Updated Date - 2020-10-09T17:37:11+05:30 IST