Kodaikanal: ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించి జలపాతంలో పడిపోయి..

ABN , First Publish Date - 2022-08-05T01:38:33+05:30 IST

తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొడైకెనాల్‌ (Kodaikanal)లో విషాదం చోటుచేసుకుంది. ఫొటో

Kodaikanal: ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించి జలపాతంలో పడిపోయి..

చెన్నై: తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొడైకెనాల్‌ (Kodaikanal)లో విషాదం చోటుచేసుకుంది. ఫొటో తీసుకునేందుకు ప్రయత్నిస్తూ 28 ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు జలపాతం (Waterfall)లో జారి గల్లంతయ్యాడు. ఈ ఘటనను మొత్తం అతడి స్నేహితుడు తీసిన వీడియోలో రికార్డయింది. బుధవారం (ఆగస్టు 3న)న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. 


సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన యువకుడిని అజయ్ పాండియన్‌గా గుర్తించారు. అతడి స్నేహితుడు కల్యాణ సుందరం తీసిన 47 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్న దాని ప్రకారం అజయ్ పాండియన్ తొలుత జలపాతం ఒడ్డున ఓ రాయిపై కూర్చుని ఫొటో తీసుకున్నాడు. ఆ తర్వాత వెనక నుంచి వీడియో తీస్తున్న ఫ్రెండ్‌ను పిలిస్తూ ముందుకొచ్చి ఫొటోలు, వీడియోలు తీయాలని కోరాడు. ఆ వీడియోలో జలపాతం కూడా కనిపిస్తోంది. దీంతో స్నేహితుడు అతడిని అనుసరిస్తుండగా అజయ్ కిందకి దిగుతూ ఒక జారుడు బండపై రాయి వేశాడు. ఆ వెంటనే ఫొటోకు పోజిచ్చాడు. అనంతరం వాటర్‌ఫాల్ వైపు తిరిగాడు. 


ఆ తర్వాత కొన్ని క్షణాలకే అజయ్ కాలు జారడంతో పట్టుకోల్పోయి కిందికి జారిపోయాడు. ఈ క్రమంలో రాయిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత మూడు నాలుగు సెకన్లకే కిందికి జారి జలపాతంలో మునిగిపోయి కొట్టుకుపోయాడు. అది చూసి అతడి స్నేహితుడు కల్యాణ సుందరం ‘మచ్చాన్’ అని గట్టిగా పిలుస్తూ ఏడవడం ఆ వీడియోలో రికార్డైంది. ఆ తర్వాత అతడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది అజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-08-05T01:38:33+05:30 IST