కోట్ల బీమాకోసం మాస్టర్ ప్లాన్.. తాచుపాముతో ఓ వ్యక్తిని కాటేయించి పెద్ద నాటకం.. చివరికి కరోనాతో కథ అడ్డం తిరిగింది

ABN , First Publish Date - 2021-10-27T15:31:01+05:30 IST

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో పోలీసులు ఒక వింత కేసు ఎదుర్కొన్నారు. ముందు చాలా సింపుల్ కేసు అనుకున్నారు. కానీ లోతుగా పరిశీలిస్తే కోట్ల రూపాయలు కొల్లగొట్టే ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ బయటపడింది. అసలేం జరిగిదంటే..

కోట్ల బీమాకోసం మాస్టర్ ప్లాన్.. తాచుపాముతో ఓ వ్యక్తిని కాటేయించి పెద్ద నాటకం.. చివరికి కరోనాతో కథ అడ్డం తిరిగింది

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో పోలీసులు ఒక వింత కేసు ఎదుర్కొన్నారు. ఏదో చాలా సింపుల్ కేసు అనుకున్నారు. కానీ లోతుగా పరిశీలిస్తే కోట్ల రూపాయలు కొల్లగొట్టే ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ బయటపడింది. అసలేం జరిగిదంటే..


పోలీసుల కథనం ప్రకారం.. అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రభాకర్(54) అనే వ్యక్తి 20 ఏళ్లుగా అమెరికాలో ఉన్నాడు. గత జనవరిలో భారత్ తిరిగి వచ్చాడు. అహ్మద్‌నగర్‌ జిల్లాలోని రాజోర్ గ్రామంలో నివసిస్తున్నాడు. ఏప్రిల్ 22న పోలీసులకు ప్రభాకర్ మృతి చెందాడని సమాచారం అందింది. అతనికి అమెరికన్ పౌరసత్వం ఉండడంతో పోలీసులు అమెరికన్ ఎంబసీకి నివేదిక ఇవ్వ వలసి ఉంటుంది.



మరణం ఎలా జరిగిందో పరిశీలించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ముందుగా ప్రభాకర్ మృతదేహం ఉన్న ఆస్పత్రికి ఒక కానిస్టేబుల్ వెళ్లాడు. అక్కడ పోస్టు మార్టం రిపోర్టులో ప్రభాకర్ ఒక తాచుపాము కాటు వలన మృతి చెందాడిన తేలింది. కానీ ఆ మృతదేహం తనకు అప్పగించాల్సిందిగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు.  తన పేరు ప్రవీణ్ అని చెప్పాడు.  తాను ప్రభాకర్ సోదరుడి కుమారుడిని అని, ప్రభాకర్‌కు తను తప్ప బంధువులెవరూ లేరని చెప్పాడు. పోలీసులు ముందుగా ఆ శవం ప్రభాకర్ దేనా అని అడిగారు. అందుకు అతను "అవును అది మా అంకుల్ డెడ్ బాడీ" అని అన్నాడు. పోలీసులు శవం ఫోటో తీసుకొని.. ప్రభాకర్ నివసించే ఇంటి వద్దకు వెళ్లారు. ఇంట్లో ఎటువంటి గుర్తింపు పత్రాలు దొరకకపోవడంతో.. చుట్టు పక్కల శవం ఫోటో చూపించి గుర్తించమని అడిగారు. ఎవరూ సమాధానం చెప్పలేదు. ొక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ ఫొటో ప్రభాకర్‌దేనని చెప్పాడు. దీంతో పోలీసులు కేసు మూసేశారు.


కానీ కొద్ది నెలల తరువాత అమెరికా నుంచి ప్రభాకర్‌కు జీవిత బీమా ఉందని, అతని బంధువులకు ఆ బీమా ప్రకారం 37 కోట్లు వస్తాయని.. ఒక బీమా ఏజెంటు వచ్చాడు. అతడు పోలీసుల వద్దకు వెళ్లి అతని కేసు ఫైల్ చూశాడు. అందులో ఉన్న శవం ఫొటో సరిగా లేదని.. ఆ శవం ప్రభాకర్‌ది కాదని అనుమానం వ్యక్తం చేశాడు. ప్రభాకర్ అమెరికాలో ఉన్నప్పటి ఫొటో ఒకటి పోలీసులకు చూపించాడు. పోలీసులు ఆ ఫొటో చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆ ఫొటోలో ఉన్నది ప్రవీణ్ అంటూ వచ్చిన వ్యక్తి.


పోలీసులు మళ్లీ ప్రభాకర్ కేసుని విచారణ చేయడం మొదలుపెట్టారు. ముందుగా ప్రవీణ్ ఎవరు అని దర్యాప్తు చేశారు. ప్రవీణ్ అనే వ్యక్తి నిజంగానే ప్రభాకర్ బంధువని తెలిసింది. ప్రవీణ్ ఇంటి అడ్రస్ తెలుసుకొని అక్కడకు వెళ్లి విచారణ చేయగా.. ప్రవీణ్ గత సంవత్సరం కరోనా వల్ల మరణించాడని తెలిసి పోలీసులకు మళ్లీ షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో ఏదో మోసం ఉందని అనుమానించిన పోలీసులు, ముందుగా అమెరికన్ ఎంబసీలో ప్రభాకర్ గురించి సమాచారం సేకరించారు. అందులో ప్రభాకర్ ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ కాల్ రికార్డ్స్ చెక్ చేయగా.. ఆ నెంబర్ ఇప్పటికీ పనిచేస్తూ ఉందని తేలింది.


దాంతో పోలీసులు ఆ నెంబర్‌ని ట్రాక్ చేసి ప్రభాకర్‌ని పట్టుకున్నారు. ప్రభాకర్ బ్రతికే ఉంటే! మరి ఆ శవం ఎవరిది?.. అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. పోలీసులు తమ పద్ధతిలో ప్రభాకర్‌ని ప్రశ్నించగా.. అది ఒక అనాథ వ్యక్తి శవమని, ఆ వ్యక్తిని పాముతో కరిపించి హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇదంతా తన ఇన్సూరెన్స్ డబ్బులు పొందడానికి, అమెరికాలో తన తీర్చలేని అప్పుల నుంచి తప్పించుకోవాడానికి తన వేసిన ప్లాన్ అని ప్రభాకర్ చెప్పాడు.


పోలీసులు ప్రభాకర్‌పై చీటింగ్, హత్యానేరం కింద అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-10-27T15:31:01+05:30 IST