Execution: హత్యకేసులో దోషికి మరణ శిక్ష అమలు.. అతడిని క్షమించాం..చంపొద్దని బాధితులు వేడుకున్నా..

ABN , First Publish Date - 2022-07-30T02:37:44+05:30 IST

దశాబ్దాల నాటి హత్య కేసులో దోషిగా తేలిన అమెరికా వ్యక్తికి ఇటీవల అలబామా రాష్ట్ర ప్రభుత్వం మరణ శిక్ష అమలు చేసింది. తాము దోషిని క్షమించామంటూ బాధితులు అతడి మరణశిక్ష నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయింది.

Execution: హత్యకేసులో దోషికి మరణ శిక్ష అమలు..  అతడిని క్షమించాం..చంపొద్దని బాధితులు వేడుకున్నా..
జేమ్స్

ఎన్నారై డెస్క్: దశాబ్దాల నాటి హత్య కేసులో దోషిగా తేలిన అమెరికా వ్యక్తికి ఇటీవల అలబామా రాష్ట్ర ప్రభుత్వం మరణ శిక్ష(Execution) అమలు చేసింది. తాము దోషిని క్షమించామంటూ బాధితులు అతడి మరణశిక్షను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తన గర్ల్‌ఫ్రెండ్‌ హాల్‌ను హత్య చేసిన జో నేథన్ జేమ్స్ జూనియర్‌కు 1994లో కోర్టు మరణశిక్ష విధించింది. తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంలో జేమ్స్ ఆమెపై కాల్పులు జరిపి పొట్టనపెట్టుకున్నాడు. ముక్కుపచ్చలారని హాల్ కూతుళ్లు ఇద్దరూ ఆ దారుణాన్ని ప్రత్యక్షంగా చూశారు. అప్పటికి ఆమె పెద్ద కుమార్తె వయసు ఆరేళ్లు కాగా.. రెండో కుమార్తె వయసు 3 ఏళ్లు. అయితే.. గురువారం నాడు సౌత్ అలబామాలోని(Alabama) ఓ జైల్లో అధికారులు అతడికి మరణ శిక్ష అమలు చేశారు. ప్రాణాంతకమైన ఇంజెక్షన్‌ను జేమ్స్‌కు ఇవ్వడంతో అతడు మరణించాడు. అయితే.. హాల్ కూతుళ్లు మాత్రం మరణ శిక్షను వ్యతిరేకించారు. కానీ..అలబామా గవర్నర్ మాత్రం మరణ శిక్ష అమలు చేయాలని నిర్ణయించడంతో అతడి జీవితం ముగిసింది. 


బాధితుల అభిప్రాయానికి తాను విలువనిస్తానని గవర్నర్ ఈ సందర్భంగా చెప్పారు. అయితే.. చట్టం పట్ల తనకున్న బాధ్యతను నిర్వర్తించక తప్పదని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరగాలని, ప్రజాభద్రతను కాపాడాల్సిన కర్తవ్యం తనపై ఉందని తెలిపారు. మరోవైపు.. మరణశిక్ష అమలు అనంతరం హాల్ కుమార్తెలు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కేవలం ఒక వ్యక్తి మనకు దూరమయ్యాడన్న కారణంతో ప్రభుత్వం మరో ప్రాణం తీయదని తాము భావించాం. మా కుటుంబంపై ఇంత దారుణానికి పాల్పడ్డ నిందితుడిని మేము క్షమించాం. అతడి మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా(Life sentence) మార్చాలని ఆశించాం. మన న్యాయవ్యవస్థ ఏదోక రోజు బాధితుల అభిప్రాయాలను.. ప్రభుత్వాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నా సరే పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఈ గాయం నుంచి దేవుడు మమ్మల్ని కోలుకునేలా చేయాలని కోరుకుంటున్నాం’’ అంటూ వారు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. 

Updated Date - 2022-07-30T02:37:44+05:30 IST