లాక్‌డౌన్‌లో సొంతూరికి వచ్చి.. పాత పగ తీర్చుకున్నాడు.. కానీ అడ్డంగా దొరికిపోయాడు..!

ABN , First Publish Date - 2020-10-29T18:58:38+05:30 IST

వెలిగండ్ల మండలం బాల వెంగన్నపల్లి గ్రామంలోని పొలాల్లో ఈ నెల 24న వృద్ధుడు అన్నెబోయిన రామసుబ్బయ్య (70)ను పెట్రోల్‌ పోసి హతమార్చిన కేసులో నిందితుడు రమణయ్యను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

లాక్‌డౌన్‌లో సొంతూరికి వచ్చి.. పాత పగ తీర్చుకున్నాడు.. కానీ అడ్డంగా దొరికిపోయాడు..!

తల్లిని కొట్టాడనే కక్షతోనే వృద్ధుడి హత్య.. నిందితుడి అరెస్టు

వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు  


కనిగిరి(ప్రకాశం) : వెలిగండ్ల మండలం బాల వెంగన్నపల్లి గ్రామంలోని పొలాల్లో ఈ నెల 24న వృద్ధుడు అన్నెబోయిన రామసుబ్బయ్య (70)ను పెట్రోల్‌ పోసి హతమార్చిన కేసులో నిందితుడు రమణయ్యను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసరావు వెల్లడించారు. మృతుడు రామసుబ్బయ్యకు నిందితుడు రమణయ్య తల్లిదండ్రులకు పొలం దగ్గర గొడవలు ఉన్నాయి. 2017 సంవత్సరంలో నిందితుడు వెంకట రమణయ్య తండ్రి అన్నెబోయిన చిన్నరామయ్యకు, మృతి చెందిన రామసుబ్బయ్యకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో అడ్డం వెళ్లిన నిందితుడి తల్లి బాలమ్మను రామసుబ్బయ్య కొట్టాడు. అప్పటి నుంచి ఆమె అనారోగ్యం పాలైంది. ఆ సమయంలో ఎప్పటికైనా రామసుబ్బయ్యను చంపుతానని రమణయ్య అంటుండేవాడు. 2018 జూన్‌లో తల్లి  మృతి చెందింది. అప్పటి నుంచి ఊరు వదిలి వెళ్లి పూణేలో ఓ హోటల్‌లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. కరోనా కావడంతో వెంకటరమణయ్య స్వగ్రామం బాల వెంగన్నపల్లికి తిరిగి వచ్చాడు.


అప్పటి నుంచి రామసుబ్బయ్యని చంపేందుకు పథకం పన్నాడు. కొన్ని రోజుల క్రితం క్యాన్‌లో పెట్రోల్‌ పోయించుకుని సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 23న రాత్రి రామసుబ్బయ్య అతని పొలం కాపలాకు వెళ్లడాన్ని వెంకటరమణయ్య గమనించాడు. పెట్రోల్‌ క్యాన్‌, గొడ్డలి, అగ్గిపెట్టె తీసుకుని పొలం వద్దకు వెళ్లాడు. ఆదమరచి నిద్రపోతున్న రామసుబ్బయ్యను గొడ్డలితో తలపై, మెడపై నరికాడు. ఆ తరువాత పెట్రోల్‌ పోసి  తగులబెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా తెల్లవారు జామున పారిపోయాడు. పోలీసుల విచారణలో రామ సుబ్బయ్యకు, నిందితుడు రమణయ్య తల్లిదండ్రులకు మధ్య కక్షలు బయటపడ్డాయి. ఇదే తరుణంలో వెంకటరమణయ్య కనపడకుండా ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా, పూణే వెళ్లేందుకు రమణయ్య పొదిలిలో ఉండగా కనిగిరి, హనుమంతునిపాడు ఎస్‌ఐలు రామిరెడ్డి, శ్రీహరిలు మాటువేసి పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. మూడు రోజుల వ్వవధిలోనే కేసును ఛేదించిన సీఐ కె.వెంకటేశ్వరరావును, ఎస్‌ఐలు రామిరెడ్డి, శ్రీహరి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి ప్రతిపాదిస్తానని డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2020-10-29T18:58:38+05:30 IST