Security Lapse: మమతా బెనర్జీ నివాసంలోకి ప్రవేశించిన అగంతకుడు

ABN , First Publish Date - 2022-07-04T02:21:34+05:30 IST

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెక్యూరిటీ విషయంలో లోపం తలెత్తినట్టు...

Security Lapse: మమతా బెనర్జీ నివాసంలోకి ప్రవేశించిన అగంతకుడు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సెక్యూరిటీ (Security) విషయంలో లోపం (Lapse) తలెత్తినట్టు తెలుస్తోంది. సౌత్ కోల్‌కతాలోని మమతా బెనర్జీ నివాసంలోకి ఒక వ్యక్తి చొరబడిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అపరిచిత వ్యక్తి ప్రహరీరోడ ఎక్కి లోపలకు ప్రవేశించి, రాత్రంతా ఇంట్లోనే దాక్కున్నాడు. ఆదివారం ఉదయం అతన్ని భద్రతా సిబ్బంది పట్టుకుని స్థానిక కాళీఘాట్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. హైసెక్యూరిటీ జోన్‌లోకి ఏ ఉద్దేశంతో అతను ప్రవేశించాడు, అది కూడా ప్రహరీగోడ ఎక్కి లోపలకు ఎందుకు ప్రవేశించాడనే విషయంపై పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు.


కాగా, శనివారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇంటి ప్రహరీగోడ ఎక్కి లోపలకు ప్రవేశించానని, రాత్రంతా అక్కడే ఉన్నానని పోలీసుల ఇంటరాగేషన్‌లో ఆ వ్యక్తి అంగీకరించాడు. సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి అతను ఎలా ప్రవేశించాడు? అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు కూడా చిక్కకుండా ఉండటం ఏమిటనే విషయంపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. సీఎం నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండొచ్చనే విషయాన్ని ఇప్పటికిప్పుడు కొట్టివేయలేమని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. దీనిపై సీఎం కార్యాలయం సెక్యూరిటీ ఏర్పాట్లు చూసే ఇన్‌చార్జిని, అక్కడి  ఆఫీసర్లను, సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-07-04T02:21:34+05:30 IST