America: బ్యాంకు అధికారులకు సినిమా చూపించిన దొంగ.. వృద్దురాలి వేషంలో వచ్చి మరీ..

ABN , First Publish Date - 2022-07-21T19:22:28+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఓ వ్యక్తి చోరీకి పాల్పడిన తీరు అచ్చం సినిమాను తలపించింది.

America: బ్యాంకు అధికారులకు సినిమా చూపించిన దొంగ.. వృద్దురాలి వేషంలో వచ్చి మరీ..

జార్జియా: అగ్రరాజ్యం అమెరికాలో ఓ వ్యక్తి చోరీకి పాల్పడిన తీరు అచ్చం సినిమాను తలపించింది. వృద్దురాలి వేషంలో వచ్చిన ఓ నల్లజాతీయుడు పట్టపగలే దోపిడీకి పాల్పడి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మెక్‌డొనఫ్ పోలీసులు ఆ దొంగ కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆగ్నేయ అట్లాంటా పరిధిలోని హెన్రీ కౌంటీలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి వృద్దురాలి వేషంలో బ్యాంకులోకి వెళ్లాడు. ఆ తర్వాత బ్యాంకు సిబ్బందిని గన్‌తో బెదిరించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్నాడు. అనంతరం బయటకు వచ్చి నెంబర్‌ ప్లేట్‌ లేని ఓ కారులో పరారయ్యాడు. అయితే, బ్యాంకు పరిసర ప్రాంతంలోని వాళ్లు ఎవరూ కూడా నల్లజాతీయుడి ఆ వింత గెటప్‌ని పసిగట్టలేకపోవడం గమనార్హం. 


ఇక చోరీ తర్వాత అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించడంతో దొంగ వృద్దురాలి వేషంలో వచ్చి దోపిడీకి పాల్పడిన విషయం తెలిసింది. తాజాగా మెక్‌డొనఫ్ పోలీసులు వృద్ధురాలి గేటప్‌లో వచ్చిన వ్యక్తి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఈ దోపిడీ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ దొంగ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ వ్యక్తి ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ చోరీ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.  

 



Updated Date - 2022-07-21T19:22:28+05:30 IST