పెళ్లి తర్వాత భార్య గురించి షాకింగ్ విషయం తెలిసి.. విడాకుల కోసం కోర్డుకెక్కిన సౌదీ వ్యక్తి.. చివరికి

ABN , First Publish Date - 2022-03-22T18:41:08+05:30 IST

మనం ఇప్పటివరకు చాలా జంటలు చాలా సిల్లీ కారణాలతో విడాకులు తీసుకోవడం గురించి చదివే ఉంటాం.

పెళ్లి తర్వాత భార్య గురించి షాకింగ్ విషయం తెలిసి.. విడాకుల కోసం కోర్డుకెక్కిన సౌదీ వ్యక్తి.. చివరికి

దుబాయ్: మనం ఇప్పటివరకు చాలా జంటలు చాలా సిల్లీ కారణాలతో విడాకులు తీసుకోవడం గురించి చదివే ఉంటాం. ఇప్పుడు చెప్పబోయే సౌదీ అరేబియాలో జరిగిన ఈ సంఘటన కూడా ఇదే కోవలోనిది. అసలు విషయానికి వస్తే.. పెళ్లికి ముందు భార్య ధూమపానం చేసేదని తెలుకున్న భర్త.. వెంటనే తనకు విడాకులు కావాలని కోర్టుకెక్కాడు. పెళ్లి తర్వాత తన భార్య మళ్లీ ధూమపానం చేయదనే గ్యారెంటీ లేదు కనుక తనకు విడాకులు కావాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దాంతో సౌదీ కోర్టు ఆ వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది. 


వివరాల్లోకి వెళ్తే.. సౌదీలో ఉండే ఓ వ్యక్తికి స్థానిక అరబ్ మహిళతో ఇటీవలే వివాహమైంది. కొన్నిరోజులు ఆ దంపతులు బాగానే ఉన్నారు. ఈ క్రమంలో ఒకరోజు భార్య మాటల మధ్యలో భర్తతో తనకు పెళ్లికి ముందు స్మోకింగ్ అలవాటు ఉండేదని చెప్పింది. కానీ, పెళ్లికి చాలా రోజుల ముందే మానేసినట్లు తెలిపింది. అంతే.. ఆ మాట విన్న సౌదీ వ్యక్తికి ఒక్కసారిగా మతిపోయినంత పనైంది. సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్న తనకు తన భార్య మళ్లీ ధూమపానం చేయడం మొదలెడితే పరిస్థితి ఏంటనే ఆలోచన వచ్చింది. తన పరువుకు భంగం కలిగించే ఈ విషయాన్ని ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఓ న్యాయవాది ద్వారా విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. 


విచారణలో భాగంగా.. వివాహానికి ముందు తన భార్యకు స్మోకింగ్ అలవాటు ఉందని.. ఇప్పుడు మళ్లీ ఆమె ధూమపానం చేయదనే గ్యారెంటీ లేదంటూ న్యాయస్థానానికి తన గోడును వెళ్లబోశాడు. మరోవైపు భార్య తరపు న్యాయవాది కూడా తన వాదన వినిపించాడు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం చివరి సౌదీ వ్యక్తికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అంతేగాక అతడు పెళ్లి సమయంలో ఆమెకు కట్నంగా ఇచ్చిన 1.80లక్షల సౌదీ రియాళ్లు(రూ.36.66లక్షలు) తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. ఇదిలాఉంటే.. గత కొంతకాలంగా సౌదీ అరేబియాలో విడాకుల రేటు అమాంతం పెరిగినట్లు జనరల్ అథారిటీ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ప్రతి గంటకు సగటున ఏడు విడాకుల కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.   

Updated Date - 2022-03-22T18:41:08+05:30 IST