అమ్మ కంటే.. అన్నార్తులే ముఖ్యం!

ABN , First Publish Date - 2020-04-06T07:27:14+05:30 IST

అతడి తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. చివరిసారిగా డిసెంబరులో చూశాడు. తాజాగా ఆమె కన్నుమూసింది. మరెవరైనా అయితే.. వెంటనే కన్నతల్లి కడసారి చూపుకోసం ఆమె వద్ద వాలిపోయేవారేమో...

అమ్మ కంటే.. అన్నార్తులే ముఖ్యం!

  • తల్లి అంత్యక్రియలకు వెళ్లకుండా నిరాశ్రయులకు ఆహారం 

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: అతడి తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. చివరిసారిగా డిసెంబరులో చూశాడు. తాజాగా ఆమె కన్నుమూసింది. మరెవరైనా అయితే.. వెంటనే కన్నతల్లి కడసారి చూపుకోసం ఆమె వద్ద వాలిపోయేవారేమో..! కానీ షకీల్‌-ఉర్‌-రెహమాన్‌ మాత్రం.. అమ్మకంటే తనను నమ్ముకుని ఉన్న అన్నార్తుల ఆకలి బాధలే ముఖ్యమని భావించాడు. వలస కూలీల కళ్లలో ఆనందం కోసం.. బాధను దిగమింగుకున్నాడు. షకీల్‌ ఢిల్లీలో ట్రావెల్స్‌ సంస్థ యజమాని. తల్లిని చికిత్స కోసం బిహార్‌లోని సమస్తిపూర్‌ నుంచి తీసుకొచ్చాడు. రకరకాల కారణాలతో అప్పటినుంచీ తల్లివద్దకు వెళ్లలేకపోయాడు.


ఇంతలో లాక్‌డౌన్‌ విధించడంతో.. ఆకలితో అలమటిస్తున్న వారికి రోజూ ఆహార ప్యాకెట్లను అందించడం మొదలుపెట్టాడు. శుక్రవారం ఉదయం అతడి తల్లి మరణించదన్న విషయం తెలిసి వెంటనే వెళ్లిపోవాలనుకున్నాడు. అంతలోనే.. అతడు తీసుకొచ్చే ఆహారం కోసం ఎదురుచూసే వారి ముఖాలు గుర్తొచ్చాయి. అక్కడ తన తల్లికి బంధువులు అంత్యక్రియల్ని నిర్వర్తిస్తున్న సమయానికి, ఇక్కడ తాను ఢిల్లీలో ఆహార ప్యాకెట్లను పంచాడు. ‘నా స్వార్థం కోసం మరొకరి తల్లి ఆకలితో చనిపోకుండా ఉండాలంటే.. నేను నా తల్లి ఆఖరి చూపును వదులుకోవాల్సిందే’ అనేది షకీల్‌ మాట.  


Updated Date - 2020-04-06T07:27:14+05:30 IST