గుండెపోటుతో యువకుడి మృతి.. కరోనా భయంతో దరి చేరని స్థానికులు

ABN , First Publish Date - 2020-07-25T21:43:37+05:30 IST

కరోనా వేళ.. మానవత్వం మంట కలిసిపోతోంది. ఎవరు దగ్గినా.. తుమ్మినా వారిని అనుమానిస్తూ దూరం పెట్టాల్సిన పరిస్థితి ఎదురువుతోంది. చివరకు సాధారణంగా మృతిచెందినా..

గుండెపోటుతో యువకుడి మృతి.. కరోనా భయంతో దరి చేరని స్థానికులు

మానవత్వం.. మంట కలిసి

అధికారుల సహకారంతోనే అంత్యక్రియలు


(పలాస, శ్రీకాకుళం): కరోనా వేళ.. మానవత్వం మంట కలిసిపోతోంది. ఎవరు దగ్గినా.. తుమ్మినా వారిని అనుమానిస్తూ దూరం పెట్టాల్సిన పరిస్థితి ఎదురువుతోంది. చివరకు సాధారణంగా మృతిచెందినా.. కరోనా భయంతో ఇరుగుపొరుగు వాళ్లు కూడా దరి చేరని దుస్థితి నెలకొంది. పలాసలో ఇటువంటి ఘటనే శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఓ యువకుడు (34) గుండెపోటుకు గురై మృతి చెందగా, ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు వెనుకంజ వేశారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ముందుకు రాలేదు. దీంతో అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. పలాసలోని ఓ జీడి పరిశ్రమలో గుమస్తాగా పనిచేస్తున్న ఒక యువకుడు శుక్రవారం వేకువజామున గుండెపోటుతో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన భార్య ఇరుగుపొరుగు వారిని పిలిచి తన భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రాధేయ పడింది. అయినా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఈ విషయం అధికారులకు  చేరింది. వారు స్పందించి  ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 


అప్పటికే  యువకుడు మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. అరగంట ముందు తీసుకువచ్చి ఉంటే బతికి ఉండేవాడని వైద్యులు చెప్పడంతో ఆయన భార్య గుండెలవిసేలా రోధించింది. నిబంధనల ప్రకారం మృతుడికి కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు నెగిటివ్‌ రావడంతో అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని అధికారులు సూచించారు. అయితే... మృతదేహాన్ని శ్మశానికి తీసుకెళ్లేందుకు కూడా స్థానికులు ఎవరూ రాలేదు. దీంతో అధికారులే కైవల్యరథం సాయంతో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అదే ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉండటంతో ఆ కుటుంబానికి పరామర్శించేందుకు కూడా ఎవరూ రాలేదు. ఇరుగుపొరుగు వారు.. బంధువులు ఎవరూ రాక.. తన ఇద్దరు చిన్నారులతో ఆమె దీనంగా రోదిస్తోంది. తమకు ఇక దిక్కెవరంటూ కన్నీటిపర్యంతమైంది. ప్రస్తుతం యావత్‌ ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తున్న వేళ.. తోటి మనిషి సాయం బాధితులకు ఎంతో అవసరం. కానీ, సాధారణ మరణాలకు సైతం.. కరోనా సాకుతో భయపడి.. ఇలా మానవత్వం మంట కలిసేలా కొందరు ప్రవర్తించడం దురదృష్టకరం. 

Updated Date - 2020-07-25T21:43:37+05:30 IST