భర్తను హత్య చేసినందుకు శిక్ష అనుభవిస్తున్న భార్య.. అనుకోకుండా ఒకరోజు అందరిముందూ ప్రత్యక్షమైన భర్త

ABN , First Publish Date - 2021-10-21T12:39:40+05:30 IST

చనిపోయిన మనిషి తిరిగి రావడం ఎక్కడైనా చూశారా?.. సినిమాలలో తప్ప నిజజీవితంలో అలా జరగడం అసాధ్యం. కానీ అచ్చం సినిమా తరహాలోనే బిహార్ ఇలాంటి సంఘటన జరిగింది. బీహార్‌లోని నర్కటియాగంజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్య కేసులో అతని భార్య 5 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తోంది...

భర్తను హత్య చేసినందుకు శిక్ష అనుభవిస్తున్న భార్య.. అనుకోకుండా ఒకరోజు అందరిముందూ ప్రత్యక్షమైన భర్త

చనిపోయిన మనిషి తిరిగి రావడం ఎక్కడైనా చూశారా?.. సినిమాలలో తప్ప నిజజీవితంలో అలా జరగడం అసాధ్యం. కానీ అచ్చం సినిమా తరహాలోనే బిహార్ ఇలాంటి సంఘటన జరిగింది. బీహార్‌లోని నర్కటియాగంజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్య కేసులో అతని భార్య 5 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తోంది. అనుకోకుండా ఒకరోజు నేను బతికే ఉన్నాను.. అంటూ ఆ వ్యక్తి  ప్రత్యక్షమయ్యాడు. ఇది చూసిన అతని కుటుంబ సభ్యులంతా షాక్‌కు గురయ్యారు. అసలు కథే ఏమిటంటే..


బీహార్‌లోని కట్‌హరీ గ్రామానికి చెందిన వికాస్ కుమార్ 2015లో తన తన సోదరుడు రామ్ బహాదూర్‌ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత కొన్ని రోజులకి తన రామ్ బహాదూర్‌ని అతని భార్య, అత్తవారే కిడ్నాప్ చేసి, హత్య ఉంటారని ఆరోపణలు చేశాడు. పోలీసులు అతని వాదనలని పట్టించుకోక పోవడంలో 2016లో కోర్టుకెక్కాడు. కేసు ఇంకా సాగుతూనే ఉంది. నిందుతులు అండర్ ట్రైల్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆ కేసులో నిందితులందరికీ ఈ మధ్యే హై కోర్టులో బెయిల్‌ దొరికింది. కానీ ఇప్పడు ఒక్కసారిగా తాను బతికే ఉన్నానని రామ్ బహాదూర్‌ కోర్టుకి రావడంతో అందరూ ఖంగుతిన్నారు.


అసలు రామ్ బహదూర్ అయిదేళ్ల వరకూ ఎక్కడున్నాడు?.. ఈ అయిదేళ్లలో కుటుంబసభ్యులని ఎందుకు కలవలేదు? అనే ప్రశ్నలకు అతను సమాధానం చెప్పాడు. రామ్ బహదూర్‌కి అయిదేళ్ల క్రితం ఉద్యోగం లేకోపోవడంతో అతను ఉద్యోగం కోసం గుజరాత్ వెళ్లాడు. అక్కడ ఒక దారం తయారు చేసే ఫ్యాక్టరీలో అతనికి ఉద్యోగం దొరికింది. ఒకరోజు సెలవు తీసుకొని గుజరాత్ నుంచి బీహార్‌లోని తన ఇంటికి  రామ్ బహదూర్ బయలు దేరాడు. దారిలో తను వస్తున్న బస్సుకి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్‌లో రామ్ బహదూర్‌ తలకు బలంగా గాయం కావడంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు. కొంతకాలం తరువాత అతను కోమా నుంచి కోలుకున్నా అతనికి ఏదీ గుర్తుకు రాలేదు. అలా నాలుగేళ్లు గడిచి పోయాయి. ఆస్పత్రిలో ఒకరోజు రామ్ బహదూర్‌కి అనుకోకుండా తన గతం గురించి కొద్ది కొద్దిగా గుర్తుకి వచ్చింది.  అప్పటి నుంచి రామ్ బహదూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తను తప్పిపోయానంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులకు అతను చెప్పేది అర్థం కాలేదు. అలా అతను తన కుటుంబాన్ని వెతకడం మొదలు పెట్టాడు. అలా 2021 ఫిబ్రవరిలో ఒకరోజు ఆస్పత్రిలో ఒకరి ఫేస్‌బుక్‌లో తన కొడుకు ఫొటో చూశాడు. 


ఫేస్‌బుక్‌లో తన కొడుకు ఫోన్ నెంబర్ కూడా ఉండడంతో రామ్ బహదూర్ కాల్ చేశాడు. అతనికి జరిగినదంతా ఫోన్లో చెప్పాడు. ఆ తరువాత రామ్ బహదూర్ భార్య, అతని కొడుకు గుజరాత్ చేరుకున్నారు. వారిద్దరితో కలిసి రామ్ బహదూర్ తన గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ కోర్టులో జరిగినదంతా చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు రామ్ బహదూర్ మిస్సింగ్, హత్య కేసుని మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-10-21T12:39:40+05:30 IST