బతుకు ‘బండి’ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-03T08:07:43+05:30 IST

తిరుపతిలో పని చేసుకొనే శ్రీనివాసరావు కడుపు మీద కొట్టింది కరోనా. పొట్ట చేతపట్టుకొని పుట్టిన కృష్ణాజిల్లాకు బైకుపై బయలుదేరితే.. గుంటూరులో ఆపిన పోలీసుల తీరు ఏకంగా ఆయనకే...

బతుకు ‘బండి’ లాక్‌డౌన్‌

చెట్టుకు యువకుడి ఉరి.. 

తిరుపతిలో కంపెనీ మూతతో బైకుపై కృష్ణా జిల్లాకు పయనం

లాక్‌డౌన్‌ ఉల్లంఘించారంటూ బాపట్లలో సీజ్‌ చేసిన పోలీసులు 

మనస్తాపంతో బలవన్మరణం


బాపట్ల టౌన్‌, మండవల్లి, ఏప్రిల్‌ 2 : తిరుపతిలో పని చేసుకొనే శ్రీనివాసరావు కడుపు మీద కొట్టింది కరోనా. పొట్ట చేతపట్టుకొని పుట్టిన కృష్ణాజిల్లాకు బైకుపై బయలుదేరితే.. గుంటూరులో ఆపిన పోలీసుల తీరు ఏకంగా ఆయనకే బలితీసుకొంది. పోలీసులు బాపట్లలో బండి లాగేసుకొన్నారు.. ఊరికి ఎలా రావాలో తెలియడం లేదంటూ కుటుంబసభ్యులు, బంధువులకు సెల్ఫీ వీడియో మెసేజ్‌ పెట్టి చెట్టుకు శ్రీనివాసరావు గురువారం ఉరేసుకొన్నారు. లాక్‌డౌన్‌ కాలం తెచ్చిపెట్టిన కష్టాలకు పరాకాష్ఠగా మిగిలిన  కృష్ణాజిల్లా మండవల్లి మండల పుట్లచెరువుకు చెందిన పేటాడ శ్రీనివాసరావు(22) చిత్తూరు జిల్లా తిరుపతిలో టీషర్టుల తయారీ కంపెనీలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో కంపెనీ మూసివేయడంతో ద్విచక్రవాహనంపై సగ్రామానికి బయలుదే రారు. మార్గమధ్యంలో గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్టుపురంలోని వెదుళ్లపల్లి చెక్‌ పోస్ట్‌ వద్ద పోలీసులు శ్రీనివాసరావును ఆపారు. ఆయన ప్రయాణిస్తున్న బైకు చెన్సై రిజిస్ర్టేషన్‌ది కావటం, కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి మూడు జిల్లాల సరిహద్దులు దాటి రావటంపై పోలీసులు ప్రశ్నించారు. కేసు నమోదు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం బైక్‌ను అందజేస్తామని చెప్పారు. శ్రీనివాసరావు కాలినడకన అక్కడినుంచి బాపట్ల బస్‌స్టాండ్‌కు చేరుకొన్నారు. స్వగ్రామానికి వె ళ్లేందుకు మార్గం కనిపించకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.   విషయాన్ని సెల్ఫీ వీడియోలో ఆయన బంధువులకు తెలియజేశారు.  శ్రీనివాసరావుకు కౌన్సెలింగ్‌ ఇచ్చి రాత్రి సమయంలో వ్యక్తిగత పూచికత్తుపై నోటీసు ఇచ్చి వదిలిపెట్టామని పోలీసువర్గాలు తెలిపాయి. ‘‘సంఘటన వివరాలు దర్యాప్తు తర్వాతే తెలుస్తాయి. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని శ్రీనివాసరావు బంధువులు చెబుతున్నారు’’ అని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-04-03T08:07:43+05:30 IST