ఆసియా మహిళ కారుపై అమెరికన్ దాడి !

ABN , First Publish Date - 2021-04-06T20:24:32+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో గత కొన్ని రోజులుగా ఆసియన్ అమెరికన్లపై దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఆసియా మహిళ కారుపై అమెరికన్  దాడి !

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో గత కొన్ని రోజులుగా ఆసియన్ అమెరికన్లపై దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆసియన్లను లక్ష్యంగా చేసుకుని అమెరికన్లు దాడులతో హడలెత్తిస్తున్నారు. ఇదే కోవలో గత నెలలలో దక్షిణ కాలిఫోర్నియాలో కారులో వెళ్తున్న ఓ ఏషియన్ మహిళ, ఆమె ఆరేళ్ల కుమారుడిపై ఓ అమెరికన్ రాయితో దాడికి పాల్పడ్డాడు. తాజాగా అతనిపై పోలీసులు జాతివిద్వేషం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మార్చి 31న డౌన్ స్ట్రీట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు వెంటనే ఈ ఘటనపై 911కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఫుల్లెర్టన్‌కు చెందిన రోజర్ జాన్కే(28) అనే యువకుడు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. అయితే, పోలీసుల విచారణలో రోజర్.. తనను కొంతమంది కొరియన్ వ్యక్తులు వేధించారని.. ఆ కోపంలోనే మహిళ కారుపై రాయి విసిరినట్లు తెలిపాడు. రోజర్‌పై పౌర హక్కుల ఉల్లంఘన, జాతివిద్వేషం కేసు నమోదు చేసినట్లు ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలియజేసింది. అతనికి ఆరేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.      

Updated Date - 2021-04-06T20:24:32+05:30 IST