ఫైజర్ టీకా మూడు డోసులు తీసుకున్నా వదిలిపెట్టని ఒమైక్రాన్

ABN , First Publish Date - 2021-12-19T02:34:44+05:30 IST

ఒకటి కాదు, రెండు కాదు.. కరోనా టీకా మూడు డోసులు తీసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్..

ఫైజర్ టీకా మూడు డోసులు తీసుకున్నా వదిలిపెట్టని ఒమైక్రాన్

ముంబై: ఒకటి కాదు, రెండు కాదు.. కరోనా టీకా మూడు డోసులు తీసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్ వదిలిపెట్టడం లేదు. అమెరికా ప్రయాణ చరిత్ర కలిగిన 29 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ వేరియంట్ బారినపడినట్టు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు.


బాధితుడు ఇప్పటికే ఫైజర్ టీకా మూడు డోసులు తీసుకున్నట్టు చెప్పారు. ఆ వ్యక్తి నవంబరు 9న న్యూయార్క్ నుంచి ముంబై చేరుకున్నాడు. అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతడి నుంచి నమూనాలు సేకరించి పూణెలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్ (ఎన్ఐవీ)కి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో అతడికి ఒమైక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయిందని బీఎంసీ అధికారులు తెలిపారు. బాధితుడు ఫైజర్ టీకా రెండు డోసులు తీసుకోవడంతోపాటు బూస్టర్ షాట్ కూడా తీసుకున్నట్టు చెప్పారు.


ముందే చెప్పినట్టు ఈ వేరియంట్ రీఇన్‌ఫెక్షన్, బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతోందని జాతీయ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రాహుల్ పండిట్ తెలిపారు. బూస్టర్ డోసు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గుతుందన్నారు. అయితే, దీని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరో మూడునాలుగు వారాలు అవసరమన్నారు. కాగా, బాధితుడిలో ఎలాంటి లక్షణాలు లేవని బీఎంసీ అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-19T02:34:44+05:30 IST