నీ కడుపులో పెరుగుతున్నది ఎవరి బిడ్డ అని భార్యను నిలదీసిన భర్త.. చివరకు జరిగిన ఘోరమిది..

ABN , First Publish Date - 2021-08-01T22:13:29+05:30 IST

వాళ్లిద్దరూ కవల పిల్లలు. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. చదువుకున్నారు. చివరకు ఒకే ఇంటికి కోడళ్లుగా వెళ్లారు.

నీ కడుపులో పెరుగుతున్నది ఎవరి బిడ్డ అని భార్యను నిలదీసిన భర్త.. చివరకు జరిగిన ఘోరమిది..

ఇంటర్నెట్ డెస్క్: వాళ్లిద్దరూ కవల పిల్లలు. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. చదువుకున్నారు. చివరకు ఒకే ఇంటికి కోడళ్లుగా వెళ్లారు. ఆ తర్వాత వారి జీవితాలు కూడా ఒకేలాంటి మలుపు తిరిగాయి. వారిలో ఒక అమ్మాయి తాజాగా ఆత్మహత్య చేసుకోగా, రెండో అమ్మాయి తీవ్రమైన షాక్‌లో ఉంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన రామ్‌నివాస్(48)కు నలుగురు ఆడపిల్లలు. వీరిలో వర్ష, రితు ఇద్దరూ కవలలు. వీరిద్దరికీ రోహితాష్(21), నాయూరామ్ అనే ఇద్దరు సోదరులకు ఇచ్చి మార్చి 15న పెళ్లి చేశారు. అక్కచెల్లెళ్లిద్దరూ మెట్టినింట్ల కలిసి ఉంటారని రామ్‌నివాస్ అనుకున్నాడు.



కానీ తానొకటి తలిస్తే విధి ఒకటి తలుస్తుందన్నట్లు.. పెళ్లి అయిన తర్వాత చదువుకుంటున్న వర్ష, రితులను మెట్టింటి వారు చదువు ఆపించేశారు. ఆ తర్వాత వర్ష నెలతప్పింది. అప్పటి నుంచి మెట్టింటి వారి టార్చర్ మరో మెట్టు పైకెక్కింది. పెళ్లి సమయంలో తీసుకున్న ట్రాక్టరు, 2.50 లక్షల నగదు, ఫర్నీచర్, నగలు చాలవంటూ గొడవ ప్రారంభించారు.


 ఇంకా కట్నం కావాలంటూ ఇద్దరు అక్కచెల్లెళ్లపై ఒత్తిడి పెట్టడం ప్రారంభించారు. చివరకు వర్ష భర్త రోహితాష్‌ చాలా ఘోరంగా భార్యను కొట్టి.. ‘‘నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు?’’ అంటూ నీచంగా ప్రశ్నించాడు. కడుపు తీయించేసుకోవాలని బలవంతం చేశాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో ఇంకా కిరాతకంగా మారిందా కుటుంబం.


ఒకరోజు టానిక్ తాగిన తర్వాత ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. తట్టుకోలేకపోయిన వర్ష.. భర్తకు, అతని కుటుంబానికి తన బాధ చెప్పి, ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరింది. వారు వర్ష బాధను అసలు పట్టించుకోలేదు. దీంతో తన సోదరుడికి ఫోన్ చేసింది వర్ష. హుటాహుటిన అక్కడకు చేరుకున్న వర్ష సోదరుడు అజయ్.. ఇద్దరు తోబుట్టువులను ఇంటికి తీసుకొచ్చేశాడు. వర్షను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేశారు. మూడ్రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత వర్ష డిశ్చార్జి అయింది. ఆరోజు రాత్రి భర్తకు ఫోన్ చేసిన ఆమె.. ఆస్పత్రిలో ఉండగా తనను కనీసం చూడటానికి కూడా రాలేదని కోప్పడింది. అప్పుడు రోహితాష్ చాలా క్రూరంగా మాట్లాడాడు. ‘‘నువ్వు మాకు చచ్చిపోయావ్. నీతో అవసరం లేదు. విషం తాగి చావు’’ అంటూ ఫోన్ పెట్టేశాడు. ఈ బాధ తట్టుకోలేకపోయిన వర్ష.. తన గదిలో సల్ఫాస్ ట్యాబ్లెట్లు ఎక్కువగా మింగేసింది. కుటుంబ సభ్యులకు విషయం తెలిసి ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. సోదరి జీవితం చూసిన రితూ ఇప్పుడు తీవ్రమైన షాక్‌లో ఉంది. మెట్టింటికి వెళ్లాలంటే భయపడుతోంది. తన కుమార్తె మరణంతో రామ్‌నివాస్.. అల్లుడు, అతని కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-08-01T22:13:29+05:30 IST