స్క్రీన్‌షాట్ చూపించి డబ్బులు కట్టేశానన్నాడు.. అడ్డంగా బుక్కయ్యాడు!

ABN , First Publish Date - 2020-09-29T17:57:35+05:30 IST

పాత ఆన్‌లైన్ చెల్లింపునకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను చూపించి ఓ యువకుడు షాపు యజమానిని...

స్క్రీన్‌షాట్ చూపించి డబ్బులు కట్టేశానన్నాడు.. అడ్డంగా బుక్కయ్యాడు!

రామ్‌గఢ్: పాత ఆన్‌లైన్ చెల్లింపునకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను చూపించి ఓ యువకుడు షాపు యజమానిని బురిడీకొట్టించేందుకు యత్నించిన వైనమిది. ఎంతకీ తన ఖాతాలో డబ్బులు రాకపోవడంతో సదరు యజమాని పోలీసులను ఆశ్రయించి అతడి ఆటకట్టించాడు. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని 32 ఏళ్ల ఇషాన్ కుమార్ గిరిగా గుర్తించినట్టు రామ్‌గఢ్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నగరంలోని ఛట్టీ బజార్‌లో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కాగా అతడితో పాటు ఉన్న మరికొందరు అక్కడి నుంచి పారిపోయారు. గతంలో చెల్లించిన ఓ పేమెంట్‌‌ను గిరి స్క్రీన్‌షాట్ తీసి దాచుకున్నాడనీ... తాజాగా మళ్లీ అదే రిసిప్ట్‌ను ప్రూఫ్‌గా చూపించి డబ్బులు కట్టినట్టు దుకాణాదారుడికి చూపించాడని పోలీసులు తెలిపారు. కాగా గిరిధ్ జిల్లాలో ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్న పప్పూమండల్ అనే సైబర్ నేరగాడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పప్పూ ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు అత్యాధునిక వసతులతో ఇంద్రభవనంలా ఉన్న అతడి నివాసాన్ని చూసి షాక్ అయ్యారు. ఇంట్లో సోదాలు నిర్వహించి లక్షలాది రూపాయల చెల్లింపులకు సంబంధించిన పలు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-09-29T17:57:35+05:30 IST