విమానం వాష్‌రూంలో ప్రయాణికుడి ప్రమాదకర చర్య.. పోలీసుల విచారణలో ఆ విషయం తనకు తెలియదంటూ షాకింగ్ సమాధానం

ABN , First Publish Date - 2022-07-20T17:47:12+05:30 IST

విమానం గాలిలో ఉండగా అందులోని ఓ ప్రయాణికుడు వింత చర్యకు పాల్పడ్డాడు. దాంతో తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

విమానం వాష్‌రూంలో ప్రయాణికుడి ప్రమాదకర చర్య.. పోలీసుల విచారణలో ఆ విషయం తనకు తెలియదంటూ షాకింగ్ సమాధానం

ఎన్నారై డెస్క్: విమానం గాలిలో ఉండగా అందులోని ఓ ప్రయాణికుడు ప్రమాదకర చర్యకు పాల్పడ్డాడు. అతడు చేసిన పనికి తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తోటి ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పెట్టిన సదరు ప్రయాణికుడిని ముంబైలోని సహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఇండిగో విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత సిబ్బంది ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సదరు ప్రయాణికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ షాహిద్(50) అనే ప్రయాణికుడు తన పిచ్చి పనితో విమానంలో కొద్దిసేపు అందరినీ భయబ్రాంతులకు గురి చేశాడు. భారత్‌కు వచ్చేందుకు కువైత్‌లో విమానం ఎక్కిన మహమ్మద్ విమానం గాలిలో ఉండగా.. వాష్‌రూంకు వెళ్లి స్మోకింగ్ మొదలెట్టాడు. దీంతో క్యాబిన్ నుంచి పొగ రావడం గమనించిన సిబ్బంది వెంటనే అతడిని పొగ తాగడం ఆపాలని హెచ్చరించారు. బయటకు వచ్చిన తర్వాత విమానంలో ధూమపానం చేయడం నిషేధమని తెలిపారు. దానికి మహమ్మద్ తనకు ఈ విషయం తెలియదంటూ తాపీగా చెప్పాడు. అనంతరం విమానం ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసి మహమ్మద్‌ను వారికి అప్పగించారు. 


పోలీసుల విచారణలో కూడా మహమ్మద్ అదే విషయం చెప్పాడు. విమానం పొగతాగకూడదనే విషయం తనకు తెలియదని పేర్కొన్నాడు. అతనిపై పోలీసులు సెక్షన్ 336 కింద కేసు నమోదు చేశారు. "మహమ్మద్ కువైత్‌లో ఒక కార్మికుడు. భారతదేశానికి తిరిగి వస్తున్నాడు. విమానం ఎక్కేటప్పుడు అతని స్నేహితులలో ఒకరు అతనికి కొన్ని సిగరెట్లు ఇచ్చాడు. అతను దానిని ఎయిర్‌క్రాఫ్ట్ వాష్‌రూమ్‌లో కాల్చడం ప్రారంభించాడు. తన చర్యతో ఇతర ప్రయాణీకుల ప్రాణాలను పణంగా పెట్టాడు" అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అంతేగాక విమానంలో ధూమపానం చేయకూడదనే చట్టం గురించి తనకు తెలియదని చెప్పినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత  మహమ్మద్‌ను పోలీసులు బెయిల్‌పై విడుదల చేశారు.

Updated Date - 2022-07-20T17:47:12+05:30 IST