అనుకోకుండా హార్డ్ డ్రైవ్‌ను చెత్తలో పడేశాడు.. దాని విలువ రూ. 2,800 కోట్లు అని తెలిసి..

ABN , First Publish Date - 2021-01-18T22:03:55+05:30 IST

యూకేకు చెందిన ఓ వ్యక్తి అనుకోకుండా పారేసిన హార్డ్ డ్రైవ్‌ను తిరిగి సాధించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.

అనుకోకుండా హార్డ్ డ్రైవ్‌ను చెత్తలో పడేశాడు.. దాని విలువ రూ. 2,800 కోట్లు అని తెలిసి..

న్యూపోర్ట్: యూకేకు చెందిన ఓ వ్యక్తి అనుకోకుండా పారేసిన హార్డ్ డ్రైవ్‌ను తిరిగి సాధించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కేవలం హార్డ్ డ్రైవ్ కోసం ఎందుకంత కష్టపడుతున్నాడంటే.. ఆ హార్డ్ డ్రైవ్‌లో దాదాపు 280 మిలియన్ పౌండ్లు(రూ. 2,778 కోట్లకు పైగా) విలువ చేసే బిట్ కాయిన్లు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జేమ్స్ హావెల్స్ అనే 35 ఏళ్ల ఐటీ ఇంజినీర్ చాలా కాలం కిందట అనుకోకుండా హార్డ్ డ్రైవ్‌ను చెత్తలో పడేశాడు. అయితే ఆ హార్డ్ డ్రైవ్‌లో అప్పటికే జేమ్స్ మైనింగ్ చేసి సంపాదించిన 7,500 బిట్ కాయిన్లు ఉన్నాయి. బిట్ కాయిన్ ధర ఇప్పుడు అమాంతం పెరగడంతో జేమ్స్‌కు తన హార్డ్ డ్రైవ్ గురించి గుర్తుకు వచ్చింది. తీరా చూస్తే తాను తన హార్డ్ డ్రైవ్‌ను తెలియక చెత్తలో పడేసిన విషయం గుర్తొచ్చింది. 


ఎలానైనా తన హార్డ్ డ్రైవ్‌ను తిరిగి పొందేందుకు జేమ్స్ ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అంతేకాకుండా.. డంపింగ్ యార్డ్ మొత్తం వెతికి తన హార్డ్ డ్రైవ్‌ను బయటకు తీస్తే 25 శాతం బిట్ కాయిన్లు సిటీ కౌన్సిల్‌కు ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. అయితే అధికారులు మాత్రం ససేమిరా అనడంతో జేమ్స్ వేరే ప్రత్యామ్నాయాల కోసం వేచి చూస్తున్నాడు. ఓ హెడ్జ్ ఫండ్ జేమ్స్ హార్డ్ డ్రైవ్‌ను వెతికేందుకు ఆర్థిక సాయం చేసేందుకు కూడా ముందుకు వచ్చింది. సిటీ కౌన్సిల్‌కు ఏ మాత్రం ఖర్చు కాకుండా తాను తన హార్డ్ డ్రైవ్‌ను వెతుక్కుంటానని జేమ్స్ అధికారులను కోరుతున్నాడు. మరి జేమ్స్‌కు తన హార్డ్ డ్రైవ్ దొరుకుతుందో లేదో చూడాలి. కాగా.. ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ ధర 36 వేల డాలర్లు(రూ. 26.37 లక్షలు)గా ఉంది.

Updated Date - 2021-01-18T22:03:55+05:30 IST