వాళ్లు చాలా డిఫరెంట్‌!

ABN , First Publish Date - 2020-09-20T05:30:00+05:30 IST

మలయాళంలో మాస్‌ హీరోగా పేరొందిన మమ్ముట్టీ ఈ సినిమాలో వడ్డీ వ్యాపారిగా నటించాడు. అతడి వద్ద ప్రసాద్‌ వర్మ అనే నిర్మాత అప్పు తీసుకుంటాడు. అయితే అతడు అప్పు చెల్లించక పోగా, పోలీస్‌ కమిషనర్‌ అయిన తన స్నేహితుడి అండ చూసుకొని ప్రసాద్‌ వర్మ బాస్‌ను లెక్కచేయడు...

వాళ్లు చాలా డిఫరెంట్‌!

తెలుగు సినీపరిశ్రమలో కొత్త కథలు దొరకడం లేదనే మాట వినిపిస్తుంటుంది. అయితే మలయాళంలో అలా కాదు. అక్కడ విడుదలయ్యే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఏడాది అభిమానులను అలరించిన కొన్ని సినిమాల విశేషాలివి...


షైలాక్

మలయాళంలో మాస్‌ హీరోగా పేరొందిన మమ్ముట్టీ ఈ సినిమాలో వడ్డీ వ్యాపారిగా నటించాడు. అతడి వద్ద ప్రసాద్‌ వర్మ అనే నిర్మాత అప్పు తీసుకుంటాడు. అయితే అతడు అప్పు చెల్లించక పోగా, పోలీస్‌ కమిషనర్‌ అయిన తన స్నేహితుడి అండ చూసుకొని ప్రసాద్‌ వర్మ బాస్‌ను లెక్కచేయడు. సినిమా సెట్‌వేసి హీరో ఎంట్రీసీన్‌ సమయంలో బాస్‌ ఎంట్రీ ఇస్తాడు. అక్కడితో కథ కొత్త మలుపు తిరుగుతుంది. లక్ష్మి అయ్యనార్‌ పాత్రలో మీన ఆకట్టుకున్నారు. రాజాధిరాజా, మాస్టర్‌పీస్‌ వంటి చిత్రాలు అందించిన అజయ్‌వాసుదేవ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 


కిలోమీటర్స్‌ అండ్‌ కిలోమీటర్స్‌

జోస్‌మెన్‌ (టొవినో థామస్‌) కుటుంబాన్ని పోషించేందుకు అన్నిరకాల ఉద్యోగాలు చేస్తుంటాడు. డబ్బు చాలకపోవడంతో ఊరినిండా అప్పులు చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో అతడు తను ఎంతో ప్రేమగా చూసుకొనే బుల్లెట్‌ బైక్‌ను అమ్మేయాలనుకుంటాడు. అయితే బైక్‌ అమ్మడానికి ముందు అతడికి క్యాథరీన్‌ స్టీవెన్స్‌ (ఇండియా జర్వీ్‌స)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమెను తనను బైక్‌ మీద తిప్పుతూ భారతదేశం మొత్తం చూపిస్తే డబ్బులు ఇస్తా అంటుంది. ఈ ప్రయాణం ఇద్దరి జీవితాల్లో మార్పు తెస్తుంది. డైరెక్టర్‌ జో బేబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది.




బిగ్‌ బ్రదర్‌

మోహన్‌లాల్‌ ప్రధాన ప్రాతలో నటించిన బిగ్‌బ్రదర్‌ జైలు నుంచి విడుదలైన వ్యక్తికి సమాజంలో ఎదురయ్యే పరిస్థితులకు అద్దం పడుతుంది. పోలీస్‌ ఆఫీసర్‌ హత్య కేసులో సచ్చిదానందన్‌ (మోహన్‌లాల్‌) జైలుకు వెళతాడు. జైలు నుంచి విడుదైలన తరువాత తన కుటుంబంతో మామూలు జీవితం గడపాలనుకుంటాడు. కానీ గతం అతడిని వెంటాడుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సచ్చిదానందన్‌ తనవాళ్లను ఎలా కాపాడుకున్నాడు అనే దాని చుట్టూ కథ తిరుగుతుంది. అదేసమయంలో డ్రగ్స్‌ ముఠా నాయకుడు ఎడ్విన్‌ మోసె్‌సను పట్టుకునేందుకు ఐపీఎస్‌ అధికారి వేదాంతం (అర్బజ్‌ఖాన్‌) రంగంలోకి దిగుతాడు. వీరి ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలను డైరెక్టర్‌ సిద్దిఖీ ఆసక్తి పుట్టించేలా తెరకెక్కించాడు. 




కప్పెలా

జాతీయ అవార్డు గ్రహీత మహమ్మద్‌ ముస్తాఫా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రాంగ్‌ ఫోన్‌కాల్‌తో ఎదురయ్యే సమస్యలను, ఏర్పడే కొత్త పరిచయాలను కళ్లకు కడుతుంది. జెస్సీ (అన్నాబెన్‌) తల్లికి కుట్టు మిషన్‌ పనిలో సాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు వాళ్ల అమ్మ చెప్పిన నంబర్‌కు కాకుండా ఆటోడ్రైవర్‌ విష్ణు(రోషన్‌ మ్యాథ్యూ) నంబర్‌కు జెస్సీ ఫోన్‌ చేస్తుంది. రాంగ్‌కాల్‌తో మొదలైన వీరి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. సరిగ్గా అప్పుడే జెస్సీకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఈ విషయంపై విష్ణు, జెస్సీ కొజికోడ్‌లో మాట్లాడాలనుకుంటారు. అయితే అనుకోకుండా రాయ్‌ (శ్రీనాథ్‌ బసిల్‌) ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. ఆద్యంతం థ్రిల్‌ను ఇచ్చే ఈ సినిమా కథ కొత్తదేమి కాదు కానీ కథనం, నటీనటుల అభినయం మెపిస్తుంది.



Updated Date - 2020-09-20T05:30:00+05:30 IST