మామిడీలా..!

ABN , First Publish Date - 2022-01-17T06:28:04+05:30 IST

మామిడికి పూత కష్టాలు వెంటాడుతున్నాయి. ఏటా జవనరిలో మామిడి తోటలు పూతతో కళకళలాడుతుండేవి.

మామిడీలా..!
తనకల్లు మండలంలో పూతలేని మామిడి పంట

మామిడీలా..!

మామిడి కి ‘పూత’ కష్టాలు..!

ఇప్పటికీ 20 శాతమే పూత 

మిగతా తోటల్లో పూత కనిపించని వైనం 

నవంబరు నెలలో భారీ వర్షాలే కారణం

దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం 

తోటలు కొనేందుకు వ్యాపారులు వెనుకంజ 

ఆందోళనలో అన్నదాతలు

అనంతపురం వ్యవసాయం, జనవరి 16: మామిడికి పూత కష్టాలు వెంటాడుతున్నాయి. ఏటా జవనరిలో మామిడి తోటలు పూతతో కళకళలాడుతుండేవి. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. గతేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు పూత రావడం ఆలస్యమవుతోంది. దీని ప్రభావం పంట దిగుబడిపై పడే అవకాశం ఉంది. ఏటా పూతతో నిండుగా ఉండే తమ మామిడి తోటలు ఈసారి వెలవెలబోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 48 వేల హెక్టార్లలో మామిడి సాగులో ఉంది. కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఆత్మకూరు, కదిరి, తలుపుల, తనకల్లు, గార్లదిన్నె, ముదిగుబ్బ, గాండ్లపెంట, ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఎక్కువశాతం మామిడి తోటలున్నాయి. బేనిసా, బెంగళూరు రకం, ఖాదర్‌, హిమయత తదితర రకాలు సాగు చేస్తున్నారు. ఏటా డిసెంబరు ఆఖరు, జనవరి నెలల్లో మామిడి తోటలు పూతతో కళకళలాడేవి. గతేడాది నవంబరులో వరుసగా కురిసిన భారీ వర్షాలకు తేమ శాతం ఎక్కువైంది. సాధారణంగా సెప్టెంబరు నుంచి మామిడి తోటలకు నీరు పెట్టడం ఆపేస్తారు. అప్పుడే పూత బాగా వస్తుంది. పూత వచ్చిన తర్వాతనే తోటలకు నీరు పెడతారు. సరిగ్గా పంటకు నీరు అవసరం లేని సమయంలో తుఫాన ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో పంట చిగురించలేదు. పూత పూయలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 20 శాతం తోటల్లో అరకొరగా పూత పూసింది. మిగతా తోటల్లో ఇంకా పూత రాలేదు. వేడి వాతావరణం ఎక్కువయ్యేలోపు పూత పూస్తేనే నిలబడుతుంది. నెలాఖరులోగా పూత పూస్తేనే దిగుబడి దక్కే పరిస్థితి ఉంది. ఫిబ్రవరి రెండోవారం దాటితే వేడి వాతావరణం పెరిగి వచ్చిన పూతంతా రాలిపోయే ప్రమాదం ఉందని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూత బాగా పూసేందుకు పలు రకాల మందులను రైతులు పిచికారీ చేస్తున్నారు. దీని కోసం ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.5 వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఈసారి మందులు కొట్టినా భారీ వర్షాలతో పూత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పూత దశలోని తోటలను తేనెమంచు పురుగు ఆశిస్తోంది. ఇది రైతులను మరింత ఆందోళనలోకి నెడుతోంది.


దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం

 మామిడి పూత ఆలస్యమైతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అదే జరిగితే రైతులకు నష్టాలు తప్పదు. కాపు ఆలస్యమైతే అకాల వర్షాల దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. పురుగు ఉధృతి పెరిగి మందుల పిచికారీ ఖర్చులు పెరుగుతాయి. ఆలస్యంగా కాపు వచ్చిన తోటల రైతులకు ఇదివరకు మార్కెట్‌లోకి వచ్చిన పంట కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. మామిడి పంట బాగా పండితే హెక్టారుకు 8 టన్నులదాకా దిగుబడి వస్తుంది. ఫిబ్రవరి రెండోవారం తర్వాత  పూత వచ్చినా మామిడి తోటలు కాపునకు వచ్చే పరిస్థితులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా డిసెంబరు ఆఖరు, జనవరి నెలల్లో పూర్తి స్థాయిలో పూత వస్తోంది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి పంట కోత దశకు చేరుకుంటుంది. అప్పటి నుంచి జూన మొదటి వారందాకా మామిడి కాయల కోతలు కొనసాగుతాయి. తొలిగా వచ్చిన పంటకు మార్కెట్‌లో ధర బాగా దక్కుతుంది. ఆలస్యంగా కోతకు వస్తే ఆశించిన స్థాయిలో ధర ఉండదు. ఈ ఏడాది జిల్లాలో నెలకొన్న పరిస్థితుల్లో సగానికిపైగా దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.


తోటలు కొనేందుకు వ్యాపారులు వెనుకంజ 

జిల్లాలో ఎక్కువ శాతం రైతులు తమ మామిడి తోటలను వ్యాపారులకు పంటకు ముందే విక్రయిస్తున్నారు. మరికొందరు పంట వచ్చిన తర్వాత మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారు. మామిడి తోటల్లో పూత, పిందెలు చూసే వ్యాపారులు ఏటా పంటను కొంటున్నారు. కొందరు వ్యాపారులు వరుసగా కొన్ని సంవత్సరాలు ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. జనవరి రెండో వారం ముగిసినా ఇంకా పూత రాకపోవడంతో తోటలు కొనేందుకు వ్యాపారులు జంకుతున్నారు. పూత పూసి, పిందెలు కాసిన తర్వాతే తోటను కొంటామని ఖరాకండిగా చెబుతున్నట్లు మామిడి రైతులు వాపోతున్నారు.





మామిడి పూతే రాలేదప్పా..

15 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఏటా డిసెంబరు ఆఖరులోనే పూత వచ్చేది. ఈ సారి నేటికీ రాలేదు. పూత వేచ్చేందుకు ఇప్పటికే మూడుసార్లు మందులు పిచికారీ చేయించా. గతేడాది అరకొర దిగుబడి తో నష్టపోయాం. ఈ ఏడాది మామిడి చెట్లు కాపునకు వస్తాయో.. లేదో అర్థం కావడం లేదు. ఆలస్యంగా పూత వస్తే.. దిగుబడి కష్టమే. ఈ ఏడాది పూర్తిగా నష్టపోయినట్లే.

- రైతు హనుమంతరెడ్డి, బసంపల్లి, శెట్టూరు మండలం


భారీ వర్షాలతో పూత ఆలస్యం

భారీ వర్షాల కారణంగానే ఈసారి పూత ఆలస్యమవుతోంది. మామిడి చెట్లకు తడి అవసరం లేని నవంబరు నెలలో వర్షాలు పడటంతో ఇబ్బంది ఏర్పడింది. జిల్లాలో ఇప్పటి దాకా 20 శాతం తోటల్లో మాత్రమే పూత వచ్చింది. మిగతా వాటిల్లో ఇంకా రాలేదు. పూత వచ్చేందుకు మందులు పిచికారీ చేసుకోవడం మంచిది. నెలాఖరులోగా పూత వస్తే సమస్య ఉండదు. ఫిబ్రవరి రెండో వారం తర్వాత పూత వచ్చినా.. పెద్దగా ప్రయోజనం ఉండదు.

- చంద్రశేఖర్‌, ఉద్యానశాఖ ఏడీ, పెనుకొండ 

Updated Date - 2022-01-17T06:28:04+05:30 IST