నందిగ్రామ్‌లో మమతతో సువేందు ఢీ

ABN , First Publish Date - 2021-03-05T13:23:52+05:30 IST

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతాబెనర్జీపై మాజీ మంత్రి సువేందు అధికారిని ఎన్నికల బరిలోకి దించాలని...

నందిగ్రామ్‌లో మమతతో సువేందు ఢీ

బీజేపీ సీఈసీ సమావేశం నిర్ణయం

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతాబెనర్జీపై  మాజీ మంత్రి సువేందు అధికారిని ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి తాను మమతాబెనర్జీని 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఇప్పటికే తాను నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని, తాను ఈ నెల 11వతేదీన నామినేషన్ సమర్పిస్తానని మమతాబెనర్జీ ప్రకటించారు. బీజేపీ సువేందు అధికారి అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో నందిగ్రామ్ లో పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది.


 టీఎంసీలో ఉన్నపుడు సువేందు అధికారి మమతాబెనర్జీకి అనుంగు అనుచరుడిగా గుర్తింపు పొందారు. నందిగ్రామ్ లో అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం  బలవంతంగా చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా మమతాబెనర్జీ పోరాడి అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి తీసుకువచ్చిన నందిగ్రామ్ ను మమతాబెనర్జీ విస్మరించారని బీజేపీలో చేరిన సువేందు అధికారి విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంమీద నందిగ్రామ్ అసెంబ్లీ సమరం సువేందు అధికారి రంగంలోకి దిగనుండటంతో ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2021-03-05T13:23:52+05:30 IST