ఓటమి భయంతో తీవ్ర నిరాశలో మమత: నఖ్వి

ABN , First Publish Date - 2021-04-12T21:16:53+05:30 IST

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి భయంతోనే తీవ్ర నిరాశలో ఉన్నారని..

ఓటమి భయంతో తీవ్ర నిరాశలో మమత: నఖ్వి

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి భయంతోనే తీవ్ర నిరాశలో ఉన్నారని, అందుకే హింసకు ప్రేరేపిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు. రెండ్రోజుల క్రితం కూచ్ బెహార్‌లో హింస చెలరేగడంపై ఆయన సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, హింసకు తావులేని వాతావరణంలో ఎన్నికలు జరగేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. అయితే, దురదృష్టవశాత్తూ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం మమత చేస్తున్నారని ఆరోపించారు. హింసకు పాల్పడే వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ ఘటనలతో ఒక్కటి మాత్రం స్పష్టం అవుతోందని, తృణమూల్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోనుందని జోస్యం చెప్పారు.


'ఓటమి భయం టీఎంసీని పట్టుకుంది. అందుకే నానా హంగామా చేస్తోంది. ఎన్నికలు కోల్పోయిన తర్వాత ఆమె ఏ డిప్రెషన్‌లో జారుకుంటారో తెలియదు. ఆమె తర్వగా కోలుకోవాలని కోరుకుంటున్నాం' అని నఖ్వి అన్నారు. కేవలం నిరాశతోనే మమతా బెనర్జీ ఎలా పడితే అలా, ఎవరిని పడితే అలా ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఒకసారి ఎన్నికల కమిషన్‌‌ను, మరోసారి భద్రతా బలగాలను, ఇంకోసారి బీజేపీని, ప్రధానిని, హోం మంత్రిని నిందిస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. గెలుస్తామని మమతకు నమ్మకం ఉంటే ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాలన్నారు. పశ్చిమబెంగాల్ ప్రజలపై ఆమెకు అంత నమ్మకం ఉంటే ఇంత రచ్చచేయాల్సిన అవసరం లేదని, మే 2న ఎలాగూ ఫలితాలు స్పష్టమవుతాయని నఖ్వి అన్నారు.

Updated Date - 2021-04-12T21:16:53+05:30 IST