ఢిల్లీకి మమత.. సోనియా, మోదీతో భేటీ..!

ABN , First Publish Date - 2021-11-22T15:30:17+05:30 IST

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఢిల్లీకి..

ఢిల్లీకి మమత.. సోనియా, మోదీతో భేటీ..!

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఢిల్లీకి వస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. తన పర్యటనలో భాగంగా వివిధ విపక్ష పార్టీల నేతలను కలుసుకోనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మమతా బెనర్జీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పార్లమెంటులో బీజేపీ వ్యూహాలను సమర్ధవంతంగా ఎదుర్కొనే విషయమై విపక్ష నేతలతో మమత చర్చించనున్నారు. ప్రధానంగా వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంటు సమావేశాల్లో చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో దీనిపై అనుసరించాల్సిన వైఖరిని విపక్ష నేతలతో మమత చర్చిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీని సైతం మమతాబెనర్జీ కలుసుకునే అవకాశం ఉంది. బీఎస్ఎఫ్ పరిధి విస్తరించేందుకు హోం శాఖ తీసుకున్న నిర్ణయంతో సహా పలు అంశాలపై ప్రధానితో మమత చర్చించనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కూడా సమావేశమయ్యే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో త్రిపుర, గోవాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు టీఎంసీలో చేరడంతో ఆమె సోనియాగాంధీని కలుస్తారా లేదా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


కాగా, మమతా బెనర్జీ ఢిల్లీకి వస్తుండటంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు పలువురు ఇప్పటికే దేశరాజధానికి చేరుకున్నారు. పార్టీ యువజన విభాగం ప్రెసిడెంట్ సయాని ఘోష్‌ను అగర్తలాలో (త్రిపుర) అరెస్టు చేసిన విషయమై ఈ నేతలంతా హోం మంత్రి అమిత్‌షాను కలుసుకోనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలను ఏకతాటిపై తేవాలని మమత చేస్తున్న ప్రయత్నాల్లో ఆమె ఢిల్లీ వస్తుండటంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇంతకుముందు జూలైలో మమతా బెనర్జీ ఢిల్లీ వచ్చారు. మేలో తిరిగి పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆమె తొలిసారి ఈ పర్యటన జరిపారు.

Updated Date - 2021-11-22T15:30:17+05:30 IST