Abn logo
Sep 10 2021 @ 16:06PM

భవానీపూర్ నుంచి నామినేషన్ వేసిన మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ, ఉప పోరుకు సిద్ధమయ్యారు. బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగబోతున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం ఆమె నామినేషన్ వేశారు. మార్చి-ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సువేంధు అధికారిపై నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో టీఎంసీ బంపర్ మెజారిటీతో గెలిచి ఆమె ముఖ్యమంత్రి అయ్యారు.


వ్యవసాయ శాఖ మంత్రి సోభందేవ్ ఛటోపాధ్యాయ్ తప్పుకోవడంతో భవానీపూర్ సీటు ఖాళీ ఏర్పడింది. వాస్తవానికి మమత కోసమే ఆ సీటు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన అప్పట్లోనే ప్రకటించారు. కాగా, సెప్టెంబర్ 30న భవానీపూర్‌లో ఉప ఎన్నిక పోరు జరగనుంది. ఇక మమతకు ప్రత్యర్థులుగా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రియాంక తిబ్రేవాల్ బరిలో ఉన్నారు. ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి శ్రీజిబ్ బిస్వాస్ పోటీ పడుతున్నారు. వాస్తవానికి భవానీపూర్ నియోజకవర్గం మమతా బెనర్జీ సిట్టింగ్ స్థానం అని చెప్పాలి. ఇదే స్థానం నుంచి 2011, 2016 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మొన్నటి ఎన్నికల్లో సువేందు చాలెంజ్‌ను స్వీకరించి నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.