ప్రధాని వర్చువల్ ఇనాగరేషన్‌లో మమత మెలిక..!

ABN , First Publish Date - 2022-01-08T00:26:14+05:30 IST

ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్టును తామెప్పుడో ప్రారంభించామని పశ్చిమబెంగాల్..

ప్రధాని వర్చువల్ ఇనాగరేషన్‌లో మమత మెలిక..!

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్టును తామెప్పుడో ప్రారంభించామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారంనాడు తెలిపారు. స్వయానా ప్రధాని నిర్వహించిన వర్చువల్ ఇనాగరేషన్‌లో మమత పాల్గొని.. ఈ మాటలు అనడం ఆసక్తికరంగా మారింది. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో ఏర్పాటు చేసిన చిత్తరంజన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ సెకెండ్ క్యాంపస్‌ను ప్రధాని వర్చువల్ మీట్‌ ద్వారా ప్రారంభించారు. ఇందులో మమతాబెనర్జీ పాల్గొన్నారు.


''ప్రధాని వర్చువల్‌గా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే దీనిపై ఒక విషయం ఆయన దృష్టికి తీసుకురావాలను అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్టును మేము కొద్దికాలం క్రితమే ప్రారంభించాం'' అని మమతాబెనర్జీ అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వేవ్ సమయంలో ఐసొలేషన్ కేంద్రాలు అవసరం కావడంతో అప్పట్లోనే ఈ ప్రాజెక్టును తాము ప్రారంభించామని చెప్పారు. చిత్తరంజన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ సెకెండ్ క్యాంపస్‌ ప్రాజెక్టులో రాష్ట్రం ప్రమేయం ఉందని, ఈ ప్రాజెక్టుకు 25 శాతం నిధులు సమకూర్చడంతో పాటు, క్యాన్సర్ ఆసుపత్రికి స్థలం కూడా తామే ఇచ్చామని ఆమె చెప్పారు. ఏదిఏమైనప్పటికీ ఈ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలని ఆమె పేర్కొన్నారు.


ఎంత దురదృష్టం?: సువేందు అధికారి

మోదీ ప్రారంభించిన ప్రాజెక్టును తాము ఎప్పుడో ప్రారంభించామని మమతా బెనర్జీ అనడంపై పశ్చిమబెంగాల్ బీజేపీ విపక్ష నేత సువేందు అధికారి ఓ ట్వీట్‌లో కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చడానికి మమతా బెనర్జీ ప్రయత్నించారని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 75 శాతం నిధులు...అంటే రూ.400 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. మమత వ్యాఖ్యలు భారతదేశ సమాఖ్య విధానాన్ని చిన్నబుచ్చేలా, మంచి కార్యక్రమం పవిత్రను చెడగొట్టేలా ఉన్నాయని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమని ట్వీట్ చేశారు.

Updated Date - 2022-01-08T00:26:14+05:30 IST