ఈసీపై మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన మమత

ABN , First Publish Date - 2021-04-26T23:24:59+05:30 IST

కరోనా విస్తరిస్తున్న సమయంలో రాజకీయ ర్యాలీలకు అనుమతించిన ఎన్నికల కమిషన్‌ను తప్పుపడుతూ..

ఈసీపై మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన మమత

కోల్‌కతా: కరోనా విస్తరిస్తున్న సమయంలో రాజకీయ ర్యాలీలకు అనుమతించిన ఎన్నికల కమిషన్‌ను తప్పుపడుతూ మద్రాసు హైకోర్టు సోమవారంనాడు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి స్పందించారు. కోర్టు వ్యాఖ్యలను ఆమె స్వాగతించారు. దేశంలో రెండో దశ కోవిడ్ వ్యాప్తికి ఈసీదే బాధ్యతని, దీని నుంచి ఈసీఐ తప్పించుకోజాలదని మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను మమత సమర్ధించారు.


తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇటీవల పూర్తి కాగా, 8 విడతల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా 7వ విడత పోలింగ్ సోమవారం జరిగింది. మరో విడత పోలింగ్ (ఈనెల 29) మాత్రమే మిగిలి ఉంది. పోలింగ్ పూర్తయిన అన్ని రాష్ట్రాలకు చెందిన ఫలితాలు మే 2న వెలువడతాయి. కాగా, కోల్‌కతాలో సోమవారంనాడు తన ఓటు హక్కును మమతా బెనర్జీ ఉపయోగించుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో కోవిడ్ విస్తరణకు ఒక కారణమవుతున్న కేంద్ర బలగాలను ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మమత డిమాండ్ చేశారు.


దీనికి ముందు, దేశంలో రెండో దశ కోవిడ్ విస్తరణకు ఈసీ బాధ్యత వహించాలంటూ మద్రాసు హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ''ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలి. విధులను సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం చెందడంపై ప్రాసిక్యూట్ చేయాలి'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ ఎన్నికల ర్యాలీలను ఈసీ నిరోధించలేకపోయిందని, రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలు, ప్రోటాకాల్స్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా మిన్నకుండిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓట్ల లెక్కింపు రోజైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు సూచించిది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది. 30వ తేదీలోగా ఓట్ల లెక్కింపు ప్రణాళిక ఇవ్వకుంటే తమిళనాడులో ఓట్ల లెక్కింపు ఆపేస్తామని హెచ్చరించింది. 

Updated Date - 2021-04-26T23:24:59+05:30 IST