వర్చువల్ ర్యాలీలో అఖిలేశ్‌తో కలిసి పాల్గొననున్న మమత

ABN , First Publish Date - 2022-01-19T01:02:16+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు

వర్చువల్ ర్యాలీలో అఖిలేశ్‌తో కలిసి పాల్గొననున్న మమత

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలగా ఉండగా, యోగి సర్కారును ఎలాగైనా గద్దె దించి మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రణాళికలు రచిస్తున్నారు.


ఇందుకోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని రంగంలోకి దింపుతున్నారు. బెంగాల్‌లో బీజేపీకి ముచ్చెమటలు పట్టించిన మమతతో ప్రచారం చేయించడం ద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు మమత కూడా సరేనన్నారు. 


వచ్చే నెల 8న లక్నోను సందర్శించనున్న మమత అఖిలేశ్ యాదవ్‌తో కలిసి వర్చువల్ ర్యాలీలో పాల్గొంటారు. అలాగే, వారణాసిని సందర్శిస్తారు. అనంతరం అక్కడే వర్చువల్ సమావేశంలో పాల్గొంటారని సమాజ్‌వాదీ పార్టీ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నందా తెలిపారు. కాగా, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో జరగనుండగా, మణిపూర్‌లో రెండు దశల్లో జరగనున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. 

Updated Date - 2022-01-19T01:02:16+05:30 IST