మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు

ABN , First Publish Date - 2022-02-03T00:53:20+05:30 IST

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబైలోని మజగావ్ మెట్రోపాలిటన్ కోర్టు..

మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు

ముంబై: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబైలోని మజగావ్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 2న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ముంబై సిటీకి గత ఏడాది డిసెంబర్‌లో మమతా బెనర్జీ వచ్చినప్పుడు జాతీయ గీతాన్ని అగౌరవపరచారనే ఆరోపణలపై ఈ సమన్లు జారీ అయ్యాయి. మమతాబెనర్జీపై ముంబై బీజేపీ విభాగం కార్యకర్త వివేకానంద గుప్తా కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.


మమతా బెనర్జీ ముంబై వచ్చినప్పుడు మహారాష్ట్రలోని అధికార శివసేన, ఎన్‌సీపీ నేతలను కలిశారు. అనంతరం ఒక కార్యక్రమంలో పాల్గొంటూ సగం జాతీయ గీత ఆలపించి మధ్యలో వెళ్లిపోయారని, జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆలపించినా ఆడియెన్స్ లేచినిలబడి గౌరవం చాటుకోవాలని 2015లో హోం మంత్రి శాఖ ఇచ్చిన ఉత్తర్వులను మమతా బెనర్జీ ఉల్లంఘించారని తన ఫిర్యాదులో గుప్తా పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయినప్పటికీ అధికార విధులను నిర్వర్తించనప్పుడు ఆమెపై ప్రొసీడ్ కావడానికి ఎలాంటి అడ్డూ లేదని పేర్కొంది. మమతా బెనర్జీ జాతీయగీతాన్ని ఆలపించి, అర్థాంతరంగా ఆపేసి, ఆ తర్వాత వేదికపై నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు, ఫిర్యాదుదారు వాంగ్మూలం, వీడియో క్లిప్, యూట్యూబ్‌లోని వీడియో ద్వారా ప్రాథమిక ఆధారులున్నట్టు స్పష్టమైందని కోర్టు పేర్కొంది. నేషనల్ హానర్ యాక్ట్-1971 సెక్షన్ 3 ప్రకారం శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణ రుజువు చేస్తుందని తెలిపింది.

Updated Date - 2022-02-03T00:53:20+05:30 IST