తీస్తా సెతల్వాద్, జుబెయిర్ అరెస్టులపై Mamata Banerjee ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-28T22:19:21+05:30 IST

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు

తీస్తా సెతల్వాద్, జుబెయిర్ అరెస్టులపై Mamata Banerjee ఆగ్రహం

కోల్‌కతా : సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ (Teesta Setalwad), ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబెయిర్‌ (Mohammed Zubair)లను అరెస్టు చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ సామాజిక మాధ్యమాలన్నీ బూటకపు వీడియోలు, తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేసేవేనని మండిపడ్డారు. 


‘‘బీజేపీ (BJP) సామాజిక మాధ్యమాలు తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగించడం, బూటకపు వీడియోలతో నిండి ఉంటాయి. మీ నేతలు చెత్త తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసినపుడు, ఇతరులను అవమానించినపుడు, మీరు వారిని అరెస్టు చేయరు. మౌనంగా ఉంటారు. వాళ్ళు జనాన్ని చంపినా, వాళ్ళని ఎవరూ ముట్టుకోరు. కానీ మేం నిజం మాట్లాడితే, మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటారు. జుబెయిర్‌ను ఎందుకు అరెస్టు చేశారు? ఆయన ఏం చేశారు? తీస్తా సెతల్వాద్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఆమె ఏం చేశారు? నేడు యావత్తు ప్రపంచం దీనిని ఖండిస్తోంది’’ అని మమత అన్నారు. 


Alt News సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహమ్మద్ జుబెయిర్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు ఒక రోజు రిమాండ్ విధించింది.  మతపరమైన మనోభావాలను ఆయన గాయపరిచారని ఆరోపిస్తూ భారత శిక్షా స్మృతిలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేయడాన్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. 


2002 గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను సృష్టించారని ఆరోపిస్తూ నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్‌లను అరెస్టు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. 


Updated Date - 2022-06-28T22:19:21+05:30 IST