Mamata Banerjee STRATEGY: దీదీ వ్యూహం మార్చారా?

ABN , First Publish Date - 2022-09-21T01:43:43+05:30 IST

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహం మార్చారా?

Mamata Banerjee STRATEGY: దీదీ వ్యూహం మార్చారా?

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహం మార్చారా? ఓ పక్క ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, జేడియూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్  తీవ్రస్థాయిలో కృషి చేస్తున్న తరుణంలో దీదీ చేస్తున్న వ్యాఖ్యలు ఆమె వ్యూహం మార్చినట్లుగా అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయని పరిశీలకులంటున్నారు. సీబీఐ, ఈడీల మితిమీరిన జోక్యం వెనుక మోదీ ఉన్నారని తాను అనుకోవడం లేదని దీదీ చెప్పారు. కొందరు బీజేపీ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం సీబీఐ, ఈడీలను వాడుకుంటున్నారని ఆరోపించారు. బెంగాల్‌ అసెంబ్లీలో ఈ అంశంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై మమత మాట్లాడారు. గతంలో పీఎంవోకు రిపోర్ట్‌ చేసే సీబీఐ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలో ఉందని మమత చెప్పారు. దీంతో ఎప్పుడూ ప్రధాని మోదీపై భగ్గుమనే బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సారి చల్లబడ్డారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 


మమత ఇటీవలే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై కూడా వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్‌లో ఉన్న వాళ్లంతా చెడ్డవాళ్లేమీ కాదని, మంచివాళ్లు కూడా ఉన్నారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాజకీయాలను ఇష్టపడనివారు కూడా ఆర్ఎస్ఎస్‌లో చాలామంది ఉన్నారని మమత తెలిపారు. 


భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌‌లపై చేసిన వ్యాఖ్యలతో మమతాబెనర్జీ వ్యూహం మార్చినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. మమత వ్యాఖ్యలను ఎంఐఎం, సీపీఎం, కాంగ్రెస్ తప్పుబట్టాయి. రాజకీయ ప్రయోజనాల కోసం మమత ఇలా గతంలో కూడా చేశారని విమర్శించాయి. గతంలో వాజ్‌పేయి హయాంలో బీజేపీతో ఆమె సన్నిహితంగా మెలిగారని ఎంఐఎం, సీపీఎం, కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇప్పుడు కూడా మమత బీజేపీకి దగ్గరయ్యేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. 


మరోవైపు మమత నుంచి తాము సర్టిఫికెట్లు, ధృవీకరణలు తీసుకోవాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మమత నేతృత్వంలోని ప్రభుత్వంలోనూ, తృణమూల్ కాంగ్రెస్‌లోనూ నిండా అవినీతిపరులే ఉన్నారని బీజేపీ పశ్చిమబెంగాల్ కో ఇంఛార్జ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. ప్రస్తుతం మమత కేబినెట్‌లోని అవినీతిపరుల ఆటకట్టించడానికి కేంద్ర సంస్థలన్నీ పనిచేస్తున్నాయన్నారు. పశ్చిమబెంగాల్‌లో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి అంతకన్నా ఎక్కువ స్థానాల్లో విజయం కోసం కమలనాథులు పోరాటం ఉధృతం చేశారు.  





2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సొంతంగా 272 స్థానాలు దాటితే ప్రాంతీయ పార్టీల నేతలతో అవసరం ఉండదు. మోదీ నేతృత్వంలో మూడోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరుతుంది. అయితే బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు జేడియూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర యత్నాలు కొనసాగిస్తున్నారు. బీజేపీయేతర కూటమిలో కాంగ్రెస్ ఉండాలని నితీశ్‌తో పాటు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధినేత స్టాలిన్, జేడీఎస్ అధినేత కుమారస్వామి శివసేన ఉద్ధవ్ వర్గం, వామపక్షాలు కోరుకుంటున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం బీజేపీయేతర కూటమిలో కాంగ్రెస్ ఉండాలా లేదా అనే విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఫలితాలు వచ్చాక ఆయన కాంగ్రెస్‌‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నితీశ్, కేసీఆర్ చేస్తున్న యత్నాలకు ప్రాంతీయ పార్టీలనుంచి, వామపక్షాల నుంచి సానుకూల స్పందన ఉంది. కాంగ్రెస్ కూడా వీరందరినీ కలుపుకుని బీజేపీపై పోరాడాలని చూస్తోంది. అయితే ఇదే సమయంలో మమతలాంటి నేతలు బీజేపీకి, మోదీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాల్లో ఐక్యత లేదనే సంకేతాలిచ్చినట్లౌతుందని పరిశీలకులు చెబుతున్నారు. మమత కనుక బీజేపీకి అనుకూలంగా మారితే మరింత మంది ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ఆమె బాటలోనే నడిచే అవకాశముంటుందంటున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో బీజేపీయేతరపార్టీల ఐక్యతపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదని పరిశీలకులు అంటున్నారు. 

Updated Date - 2022-09-21T01:43:43+05:30 IST